Begin typing your search above and press return to search.

బ‌యోపిక్స్ తో న‌లిగిపోతోన్న న‌యా స్టార్!

బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు ఎంత గొప్ప న‌టుడు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల న‌టుడు.

By:  Srikanth Kontham   |   18 Feb 2026 9:17 AM IST
బ‌యోపిక్స్ తో న‌లిగిపోతోన్న న‌యా స్టార్!
X

బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు ఎంత గొప్ప న‌టుడు అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల న‌టుడు. త‌న న‌ట‌న‌తో పాత్ర‌కే వన్నె తేగ‌లడు. స‌హ‌జ న‌ట‌న అత‌డి ప్ర‌త్యేక‌త‌. బాలీవుడ్ న‌టులంతా ఒక ఎత్తైతే? రాజ్ కుమార్ రావు పెర్పార్మెన్స్ మ‌రో లెవ‌ల్లో ఉంటుంది. ముఖ్యంగా బ‌యోపిక్స్..వాస్త‌వ సంఘ‌న‌ట‌ల స్పూర్తితో తెర‌కెక్కిన చిత్రాల్లో రాజ్ కుమార్ రావు న‌ట‌న ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఆ పాత్ర‌ల కోసం ఎంతో శ్ర‌మిస్తాడు. `ట్రాప్డ్` సినిమాలో లిప్ట్ లో చిక్కుకుపోయిన రోల్ లో ఎంత గొప్ప‌గా న‌టించాడో తెలిసిందే.

నీర‌సం, ఆక‌లితో క‌నిపించాలి. ఆ పాత్ర కోసం రాజ్ కుమార్ రావు దాదాపు 20 రోజుల పాటు కేవలం బ్లాక్ కాఫీ, రెండు క్యారెట్లు తిని గడిపాడు. సినిమా చివ‌ర్లో ఆయన బాడీ మ‌రింత బ‌ల‌హీనంగా మార‌డం చూడొచ్చు. ఎముక‌లు బ‌య‌ట‌ప‌డి నిజంగా ఆక‌లితో అల‌మ‌టించిన వ్య‌క్తినే తెర‌పై ఆవిష్క‌రించాడు. అటుపై `బోస్ : డెడ్ ఆర్ అలైవ్` లో సుభాష్ చంద్ర బోస్ పాత్ర కోసం శారీర‌కంగా చాలా మార్పులు చేసాడు. సాధార‌ణంగా చాలా మంది న‌టులు ప్రోస్తెటిక్స్ వాడుతుంటారు. కానీ రాజ్ కుమార్ రావు మాత్రం నిజంగానే స‌గం గుండు గీయించుకుని పాత్ర‌కు వ‌న్నే తీసుకొచ్చాడు.

దాదాపు 11 నుంచి 15 కిలోల బ‌రువు కూడా త‌గ్గాడు. ఆ మ‌ధ్య రిలీజ్ అయిన అంథ‌పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ పాత్ర కోసం అంతే శ్ర‌మించాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు తన కళ్ళను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచేవారు. దీనివ‌ల్ల త‌ర‌చూ తీవ్ర‌మైన త‌ల‌నొప్పి బారిన ప‌డ్డారు. అంధులు ఎలా నడుస్తారు? వస్తువులను ఎలా గుర్తిస్తారు? అనే దానిపై వారాల తరబడి రీసెర్చ్ చేశారు. అలాగే `ఓమైర్టా` లో తీవ్ర‌వాది పాత్ర పోషించి మాన‌సికంగా ఎంతో ఇబ్బంది ప‌డ్డారు. పాత్రలోని క్రూరత్వాన్ని పండించడానికి, కొన్ని రోజుల పాటు సమాజానికి దూరంగా ఉన్నాడు.

తీవ్రవాదానికి సంబంధించిన వీడియోలు, డాక్యుమెంటరీలు స్ట‌డీ చేసాడు. ఆ పాత్ర ప్రభావం వల్ల షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టింది. `బ‌దాయి దో` లో పోలీస్ ఆఫీస‌ర్ ట్రాన్ప‌ప‌ర్మేష‌న్ కోసం క‌ఠిన‌మైన డైట్ పాటించాడు. శాఖాహారి కావ‌డంతో కండ‌లు పెంచ‌డానికి అవసరమైన ప్రోటీన్ కోసం కేవలం పప్పులు, పౌడర్లతోనే శరీరాన్ని మలుచుకున్నాడు. ఇటీవ‌లే ముంబైకి చెందిన ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ ఉజ్వ‌ల్ నిక‌మ్ బ‌యోపిక్ కోసం అంతే శ్ర‌మించాడు. బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం, వృద్ధాప్యంగా క‌నిపించ‌డం కోసం ఎంతో క‌స‌ర‌త్తు చేసాడు.

సినిమా యూనిట్ వ్య‌తిరేకించినా రాజ్ కుమార్ మాత్రం రాజీ ప‌డ‌లేదు. ఈ సినిమా షూటింగ్ నుంచి ఇటీవ‌లే రిలీజ్ అయ్యాడు. త్వ‌ర‌లో మాజీ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీ పాత్ర‌లో న టించ‌డానికి రెడీ అవ‌వుతున్నాడు. గంగూలీ లుక్ కోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ని వెల్ల‌డించాడు. అయితే త‌రుచూ ఇలా పని చేయ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌తంగా బాగా న‌లిగిపోతున్నాన‌న్నాడు. డైట్లు..యోగాలు..జిమ్ములు అతిగా చేయ‌డం ఇబ్బందిగా ఉంటుద‌న్నాడు. గంగూలీ బ‌యోపిక్ అనంత‌రం కొన్నాళ్ల పాటు ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు దూరంగా ఉంటాన‌న్నాడు.