Begin typing your search above and press return to search.

సొంత ప్రాజెక్ట్ అయినా కుమారుడికి త‌ప్ప‌దు!

ఒకరి కొడుకు అయినంత మాత్రాన పాత్రలు ఇచ్చేయడం సరైన పద్ధతి కాదని.. ఆ పాత్రకు తగిన న్యాయం చేయగల సామర్థ్యం ఉంటేనే అవకాశం ఇవ్వాలని హిరానీ అభిప్రాయపడ్డారు.

By:  Srikanth Kontham   |   29 Jun 2026 3:08 PM IST
సొంత ప్రాజెక్ట్ అయినా కుమారుడికి త‌ప్ప‌దు!
X

పరిశ్రమలో వారసత్వం అనే అంశంపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంది. స్టార్ కిడ్స్‌కు అవకాశాలు సులభంగా లభిస్తాయనే విమర్శలున్నా? కొందరు ప్రముఖులు మాత్రం తమ పిల్లలను సొంత ప్రతిభతో పైకి రావాలని కోరుకుంటారు. ఈ కోవలోనే బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ కుమారుడు వీర్ హిరానీ సినీ రంగ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. వారసత్వం కంటే వ్యక్తిగత ప్రతిభ, కష్టపడే తత్వమే ముఖ్యం అని హిరానీ నొక్కి చెప్పారు. రాజ్‌కుమార్ హిరానీ కుమారుడు వీర్ హిరానీ `ప్రీతమ్ అండ్ పెడ్రో` అనే సరికొత్త వెబ్ సిరీస్ తో న‌టుడిగా తెరంగేట్రం చేస్తున్నారు.

ఈ సిరీస్‌లో వీర్ నటుడు అర్షద్ వార్సితో కలిసి స్క్రీన్ పంచుకుంటున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ కొడుకుగా నేరుగా పెద్ద సినిమాలో హీరోగా పరిచయం కాకుండా ఇలాంటి వినూత్నమైన కథాంశంతోడిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అరంగేట్రం చేయడం విశేషం. ఈ నేప‌థ్యంలోనే కుమారుడి పరిచయం గురించి రాజ్‌కుమార్ హిరానీ స్పందించారు. ` సినిమా పరిశ్రమలో రాణించాలంటే ఆడిషన్స్ ప్రాధాన్యత ఎంతైనా ఉందన్నారు. తన సొంత సినిమాలోనైనా కుమారుడు పాత్రకు సరిపోతాడా? లేదా? అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఆడిషన్స్ ఎదుర్కోవాల్సిందేనన్నారు.

ఒకరి కొడుకు అయినంత మాత్రాన పాత్రలు ఇచ్చేయడం సరైన పద్ధతి కాదని.. ఆ పాత్రకు తగిన న్యాయం చేయగల సామర్థ్యం ఉంటేనే అవకాశం ఇవ్వాలని హిరానీ అభిప్రాయపడ్డారు. సినీ రంగంలో శాశ్వతంగా నిలదొక్కుకోవడానికి తల్లిదండ్రుల పేర్లు సరిపోవని, వృత్తి పట్ల అంకితభావం , సరైన శిక్షణ అవసరమని హిరానీ నమ్ముతాన‌న్నారు. వీర్ హిరానీ కూడా నటనలో శిక్షణ పొంది రంగస్థల అనుభవాన్ని సంపాదించిన తర్వాతే కెమెరా ముందుకు వచ్చారని తెలిపారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ పరిశ్రమలోని సాధకబాధకాలను స్వయంగా తెలుసుకుని స్వయంకృషితో ఎదగడమే నిజమైన విజయమని హిరానీ పేర్కొన్నారు.

దర్శక నిర్మాతల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన ధోరణి పెరగడం పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతిభ ఉన్నప్పటికీ వెనుకడుగు వేసే కొత్త వారికి అవుట్‌సైడర్స్‌కు ఇలాంటి నిర్ణయాలు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. సినిమా ఇండస్ట్రీలో అర్హత కలిగిన వారికే అవకాశాలు లభిస్తాయనే నమ్మకాన్ని ఇలాంటి పరిణామాలు బలపరుస్తాయి. దీనివల్ల పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. సినీ ప్రపంచంలో వారసత్వం అనేది తొలి అడుగు వేయడానికి కొంత వరకు స‌హాప‌డుతుంది. కానీ సుదీర్ఘ ప్రయాణంలో విజేతగా నిలబెట్టేది మాత్రం ప్రేక్షకుల ఆదరణ ..నటన నైపుణ్యం మాత్రమే. రాజ్‌కుమార్ హిరానీ అనుసరిస్తున్న ఆదర్శవంతమైన విధివిధానాలు రాబోయే తరాల స్టార్ కిడ్స్‌కు, పరిశ్రమలోని ఇతర పెద్దలకు చక్కని మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.