Begin typing your search above and press return to search.

ఔత్సాహిక సినీర‌చ‌యిత‌లు ఈ దిగ్గ‌జాల నుంచి నేర్చుకోవాల్సిన‌వి!

సలీం-జావేద్‌ల నుంచి నేటి తరం రచయితలు ఎన్నో నేర్చుకోవాలని దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, రచయిత అభిజాత్ జోషి సూచించారు. జావేద్ అక్తర్‌లోని హాస్యచతురత, జ్ఞాపకశక్తి, సలీం ఖాన్ జీవితానుభవాలు రచయితలకు గొప్ప పాఠాలని పేర్కొన్నారు. సినిమాలు చూడటమే కాకుండా పుస్తకాలు చదవడం, మనుషులను గమనించడం ద్వారా మంచి కథలు పుడతాయని వివరించారు.

By:  Sivaji Kontham   |   23 Nov 2026 10:07 AM IST
ఔత్సాహిక సినీర‌చ‌యిత‌లు ఈ దిగ్గ‌జాల నుంచి నేర్చుకోవాల్సిన‌వి!
X

నేటి తరం ఔత్సాహిక సినీ రచయితలకు భారతీయ సినీ చరిత్రలోని దిగ్గజ రచయితల ద్వయం సలీం-జావేద్‌లతో పాటు.. మోడ్ర‌న్ డే బెస్ట్ స్టోరీ టెల్ల‌ర్ రాజ్‌కుమార్ హిరాణీ, అభిజాత్ జోషిల ప్రయాణం ఒక తెరిచిన పాఠ్యపుస్తకం లాంటిది. తాజాగా కోమల్ నహతాతో జరిగిన ప్రత్యేక చిట్ చాట్‌లో సలీం ఖాన్, జావేద్ అక్తర్‌ల గురించి హిరాణీ-అభిజాత్ షేర్ చేసిన విష‌యాలు.. కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు.. ఒక రచయిత వ్యక్తిత్వం - పనితీరు ఎలా ఉండాలో నిర్దేశించే మార్గదర్శకాలు. రచన అనేది కేవలం గదిలో కూర్చుని కాగితంపై అక్షరాలు పేర్చడం కాదని.. జీవితంలోని ప్రతి అనుభవాన్ని నిశితంగా గమనించి కథలుగా మలచుకునే ఒక నిరంతర ప్రక్రియ అని ఈ దిగ్గజాల మాటలు స్పష్టం చేస్తున్నాయి.

రాజ్‌కుమార్ హిరాణీ మాటల్లో జావేద్ అక్తర్ గురించి ప్రస్తావించిన అంశాలు నేటి రచయితలకు ఒక కీలక పాఠాన్ని నేర్పుతాయి. జావేద్ అక్తర్ ఒక గొప్ప కవి... కథా-స్క్రీన్‌ప్లే రచయిత అయినా ఆయన్ని తాను ఒక `స్టాండ్-అప్ కమెడియన్`లా చూస్తానని హిరాణీ చెప్పడం వెనుక డెప్త్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఒక రచయిత ఎప్పుడూ గంభీరంగా బిగుసుకుపోయి ఉండాల్సిన అవసరం లేదని.. చుట్టూ ఉన్న వాతావరణాన్ని తేలికపరిచే హాస్య చతురత.. సమయస్ఫూర్తి కలిగి ఉండాలని ఇది సూచిస్తుంది. జీవితంలోని చిన్నచిన్న సంఘటనలను సైతం గుర్తుపెట్టుకుని.. సందర్భానికి తగ్గట్టుగా వాటిని కథల్లోకో.. సంభాషణల్లోకో అద్భుతంగా మలచుకునే `పదాల శక్తి`, చురుకైన జ్ఞాపకశక్తి ఒక రచయితకు ఉండాల్సిన ప్రధాన ఆయుధాలని హిరాణీ విశ్లేషించారు.

అలాగే అభిజాత్ జోషి గ‌తంలో స‌లీం సాబ్ తో వాకింగ్ కి వెళ్లిన‌ప్ప‌టి జ్ఞాప‌కాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఖండాలా `రేస్‌కోర్స్` .. ముంబై బాండ్‌స్టాండ్‌లో సలీం ఖాన్‌తో కలిసి చేసిన 80 నిమిషాల నడక అనుభవం రచయితల అబ్జర్వేషన్ పవర్‌కు నిదర్శనం. సలీం ఖాన్ 80 నిమిషాల పాటు ఏకధాటిగా జీవితానుభ‌వాల‌తో పాటు సినీ జ్ఞాపకాలను షేర్ చేసేప్పుడు.. ఒక్క విషయాన్ని కూడా తిరిగి రిపీట్ చేయ‌లేదంటే.. ఆయన మెదడులో ఎంతటి కథా సంపద నిక్షిప్తమై ఉందో అర్థం చేసుకోవచ్చు. నేటి యువ రచయితలు కేవలం పాత సినిమాలను చూసి కాపీ కొట్టే ధోరణిని వీడి... ఎక్కువ‌గా పుస్త‌కాలు చదవడం.. మనుషులతో మమేకమవడం.. జీవితానుభవాలను సేకరించడం ద్వారా తమ ఆలోచనా పరిధిని విస్తరించుకోవాలనే సందేశం హిరాణీ మాట‌ల‌లో దాగి ఉంది.

మొత్తానికి.. రచయితలుగా తాము అత్యున్న‌త స్థాయికి చేరుకున్నా.. తమ ముందు తరాల దిగ్గజాలైన గుల్జార్, సలీం-జావేద్‌ల నుంచి ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నామని హిరానీ-అభిజాత్ జోషి బ‌హిరంగంగా చెప్పడం నేటి తరానికి గొప్ప స్ఫూర్తి. ఒక అద్భుతమైన కథ పుట్టాలంటే రచయితలో లోతైన జీవిత పరిశీలన.. పదునైన జ్ఞాపకశక్తి... సున్నితమైన హాస్యభావన..నిరంతర విద్యార్థిలా చ‌దివే తత్వం ఉండాలని ఈ ఇంటర్వ్యూ చెబుతోంది. సలీం-జావేద్‌ల అనుభవ సారాన్ని.. హిరాణీ-అభిజాత్‌ల కథన శైలిని ఆదర్శంగా తీసుకుంటేనే నేటి తరం రచయితలు కాలంతో పాటు నిలిచిపోయే క్లాసిక్ చిత్రాలను అందించగలరు. అలా కాకుండా నాలుగు గోడల మ‌ధ్య సీడీలు, డీవీడీలు లేదా హార్డ్ డిస్కుల్లో స్టోర్ చేసుకున్న సినిమాలు చూసి మ‌రో క‌థ‌ను పుట్టించాలనుకుంటే అది క‌చ్ఛితంగా విజ‌య తీరాల‌ను తాక‌దు.