Begin typing your search above and press return to search.

B కేటగిరీలో అయినా తీసుకోండి.. నటి సంచలన వ్యాఖ్యలు

కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్లాల్సిందే. అలాగే ఇండస్ట్రీలోనూ కొత్త ట్యాలెంట్‌ వస్తూ ఉంటే పాత ట్యాలెంట్‌ కనిపించకుండా పోతుంది.

By:  Ramesh Palla   |   22 Oct 2026 10:26 AM IST
B కేటగిరీలో అయినా తీసుకోండి.. నటి సంచలన వ్యాఖ్యలు
X

కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్లాల్సిందే. అలాగే ఇండస్ట్రీలోనూ కొత్త ట్యాలెంట్‌ వస్తూ ఉంటే పాత ట్యాలెంట్‌ కనిపించకుండా పోతుంది. అయితే హీరోలు మాత్రం ఎంత మంది కొత్త వారు వచ్చినా అలాగే ఉంటున్నారు. కానీ ఇతర టెక్నీషియన్స్‌, నటీనటుల విషయంలో మాత్రం కొత్త వారి రాకతో పాత వారికి ఆఫర్లు తగ్గుతున్నాయి. ఈ విషయం అన్ని విభాగాల్లోనూ నిరూపితం అవుతోంది. ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా సినిమా ఉండేది కాదు. ఏడాదిలో పదుల కొద్దీ సినిమాలు ఆయన నటించినవే ఉండేవి. అలాంటి బ్రహ్మానందం ఇప్పుడు ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో కూడా కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా ఆయనకు గెస్ట్ రోల్‌ మాత్రమే దక్కుతుంది. బ్రహ్మానందం పరిస్థితి అలా ఉంటే ఇక సీనియర్ క్యారెక్టర్‌ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఒక సీనియర్‌ నటి తన ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ఇండస్ట్రీలో సీనియర్స్‌కు అన్యాయం...

సీనియర్‌ నటి రజిత ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితం. ప్రేక్షకులకు ఆమె పేరు చెప్తే గుర్తుకు రాకపోవచ్చు, కానీ ఆమెను చూడగానే ఈమె ఎన్నో వందల సినిమాల్లో నటించింది కదా అంటారు. అలాంటి రజిత ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించడం లేదు. టీవీల్లో వచ్చే పాత సినిమాల్లో రజిత కనిపిస్తుంది, కానీ కొత్తగా ఓటీటీల్లో, థియేటర్లలో వచ్చే సినిమాల్లో మాత్రం రజిత కనిపించడం లేదు. అడపా దడపా ఆఫర్లు వస్తున్నప్పటికీ పెద్ద పాత్రలు కాకపోవడంతో కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో టీవీ షోలు, సీరియల్స్‌ ను సైతం రజిత వంటి సీనియర్‌ యాక్ట్రస్‌ చేయాల్సి వస్తుంది. ఇటీవల రజిత 'దొంగనా కొడుకు' అనే సినిమాలో నటించింది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ ఈవెంట్‌ లో పాల్గొన్న సమయంలో రజిత చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

సీనియర్‌ నటి రజిత...

దొంగనా కొడుకు సినిమా ఈవెంట్‌లో రజిత మాట్లాడుతూ... ఒకప్పుడు మాదిరిగా మాకు ఆఫర్లు రావడం లేదు. రెగ్యులర్‌ అయిపోయారంటూ చాలా మంది మాకు ఆఫర్లు ఇవ్వడం లేదు. సినిమాలకు మమ్ములను పిలవడం లేదు. మేము రెగ్యులర్‌ అయిపోయామని చాలా మంది అంటున్నారు. చిన్న పాత్రలకు కూడా మేము పనికి రావడం లేదు. ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ ఇవ్వమని కోరడం లేదు. సినిమాలో ఆపాత్ర ఈ పాత్ర ఇవ్వమని డిమాండ్‌ చేయడం లేదు. నదియా, ఖుష్బు వంటి వారు ఎ కేటగిరి అనుకుంటే మమ్ములను కనీసం B కేటగిరీలో అయినా పరిగణలోకి తీసుకోవాలని రజిత విజ్ఞప్తి చేసింది. లీడ్ రోల్స్ కోసం కాకున్నా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చిన్న చిన్న పాత్రలు ఇచ్చినా మేము సర్దుకుంటాం అన్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫర్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తనలాంటి చాలా మంది ఆఫర్లు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు.

దొంగనా కొడుకు ప్రమోషన్స్‌లో...

చిన్న పాత్రల కోసం కూడా బయట నుంచి నటీనటులను తీసుకు రావడం వల్ల ఇక్కడి చిన్న నటీనటులకు అవకాశాలు దక్కడం లేదని, ఇండస్ట్రీలో తమను పూర్తిగా పక్కన పెడుతున్నారని రజిత చేసిన వ్యాఖ్యలను చాలా మంది సీనియర్‌ నటీనటులు సమర్ధిస్తున్నారు. లీడ్‌ రోల్స్ అడగడం లేదని, చిన్న పాత్రలు ఇచ్చినా మేము సంతోషంగా చేస్తామని వారు అంటున్నారు. ఈ విషయమై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కొత్త దర్శకులు ఆ పాత మొహాలను మళ్లీ మళ్లీ చూశాం కదా, ఇంకేం చూస్తాం, చూపిస్తాం అనుకుంటున్నట్లుగా ఉన్నారు. అందుకే కొత్త దర్శకులు అసలు గతంలో ఉన్న నటీనటులను పట్టించుకోవడం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వారికి తగ్గ పాత్రలకు వారిని తీసుకుని వారిని ఆదుకోవాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.