జారి కింద పడ్డ రజనీకాంత్.. ఇది ఫేకా? నిజమా?
అదంతా సరే కానీ, ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఇంటి పెరడులో కాలు జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి జోరుగా వైరల్ అవుతోంది.
By: Sivaji Kontham | 31 July 2025 11:00 AM ISTసోషల్ మీడియా- డిజిటల్ యుగంలో ఏది ఫేక్? ఏది నిజమో? చెప్పడం అంత సులువు కాదు. కృత్రిమ మేధస్సు, చాట్ జీపీటీ వంటి అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాక ఇలాంటివి కనుగొనడం మరింత దుర్భరంగా మారింది. యూట్యూబ్ లో రియల్ గాళ్స్ ని మించిన అందగత్తెలను సృష్టిస్తూ, వారికి నడక నడత ఆహార్యం వంటి వాటిని అందిస్తూ, కుర్రకారుకు వలలు వేసే డిజిటల్ మాధ్యమ వికృత ఆర్జకులకు కొదవేమీ లేదు.
అదంతా సరే కానీ, ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఇంటి పెరడులో కాలు జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి జోరుగా వైరల్ అవుతోంది. రజనీలా కనిపిస్తున్న ఒక వ్యక్తి తోటలో నడుస్తూ వెళుతున్నారు. అతడు కొంత దూరం వెళ్లి న్యూస్ పూనర్ తీసుకుని, వెనక్కి తిరిగి వచ్చేప్పుడు బాగా తడిసిన రాతి నేలపై అడుగులు వేయగా, నాచు కట్టి ఉండటంతో సడెన్ గా జారి పడిపోయారు. ప్రస్తుతం ఈ క్లిప్ ని సోషల్ మీడియాల్లో జోరుగా వైరల్ చేస్తూ క్లిక్ లు, లైక్ ల కోసం సదరు యూట్యూబ్ - డిజిటల్ మాధ్యమం పాకులాడటం వీక్షకులకు వికృతంగా అనిపించింది. మీడియా పేరుతో మనిషిలోని వింత వైఖరికి, వికృత మనస్తత్వానికి ఇది కూడా ఒక నిదర్శనంగా కనిపిస్తోంది.
భారతదేశంలోని ఒక గొప్ప నటుడు కాలు జారి కిందపడిపోతే అది చూడాలనిపించే ఆనందకర విషయమా? ఇలాంటివి సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తారా? అయినా ఇది రియల్ రజనీకాంత్ కాదు అనేది స్పష్ఠంగా అర్థమవుతోంది. రజనీ పోలికలతో ఉన్న మరో వ్యక్తి. ఇది ఎలా చెప్పగలరు? అంటే.. కాలు జారి పడిన తర్వాత ఆ వ్యక్తి అంతే వేగంగా లేచి నిలబడ్డారు. దానికోసం నేలపై కేవలం మోచేతిని ఆన్చి శక్తిని పుంజుకున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి 75 వయసులో రజనీకాంత్ కింద పడిన తర్వాత నేలను తాకిన బంతిలా అంత వేగంగా లేవడం కుదరదు. అంతేకాదు.. రజనీకాంత్ ముక్కు సరిగా కనిపించకుండా, ఒక మాస్క్ కూడా వేసారు. అందువల్ల ఇది ఫేక్ క్లిప్ అని తేలిపోయింది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బాపతు వ్యక్తుల పని ఇది అని పలువురు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తన తదుపరి సినిమా కూలీ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మరికొందరు రజనీకాంత్ డూప్ గా కనిపించే మరో వ్యక్తి అని గెస్ చేస్తున్నారు.
ఖైది, లియో, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదలవుతోంది. నాగార్జున, శ్రుతిహాసన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించగా, అమీర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు.
