Begin typing your search above and press return to search.

MS సుబ్బులక్ష్మి బయోపిక్ మరో 'శంకరాభరణం' అవుతుంది: సూపర్ స్టార్ రజనీకాంత్

తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రోతలను దశాబ్దాల పాటు మైమరపించిన సంగీత సామ్రాజ్ఞి, `భారతరత్న` ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే

By:  Sivaji Kontham   |   14 Oct 2026 11:35 PM IST
MS సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం అవుతుంది: సూపర్ స్టార్ రజనీకాంత్
X

తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రోతలను దశాబ్దాల పాటు మైమరపించిన సంగీత సామ్రాజ్ఞి, `భారతరత్న` ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ దిగ్గజ గాయని బయోపిక్‌ను `భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి` పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాతలు అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాసు కాంబినేషన్‌లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తుండటం విశేషం. విలక్షణ కథాంశాలతో అలరించే టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంగీతానికి అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ స్వరాలు సమకూరుస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇటీవల సెప్టెంబర్ నెలలో సినీ దిగ్గజం, యుగపురుషుడు కమల్ హాసన్ చేతుల మీదుగా `భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి` చిత్రం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఓ మహోన్నత కళాకారిణి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నందుకు సినీ పరిశ్రమతో పాటు సంగీత ప్రియులంతా హర్షం వ్యక్తం చేశారు.

తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి మరో ఇండియన్ సినీ లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు లభించాయి. ఇటీవల జరిగిన `జైలర్ 2` సినిమా వేడుకలో రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో ఆసక్తికరంగా మాట్లాడారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో మరో `శంకరాభరణం`లా నిలిచిపోతుందని కొనియాడారు. అంతేకాకుండా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నానని తెలిపారు.

రజనీకాంత్ వంటి సినీ దిగ్గజం చేసిన ఈ వ్యాఖ్యలతో `భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి` సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. భారతీయ సంగీత రంగానికి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి చేసిన సేవలను.. ఆమె జీవితంలోని అరుదైన ఘట్టాలను ప్రతిబింబించేలా తెరకెక్కుతున్న ఈ చిత్రం, క్లాసికల్ మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త దృశ్యకావ్యంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.