'నరసింహా-2'తో రజినీ మరోసారి మ్యాజిక్ చేస్తారా? సీక్వెల్‌కు అసలు పరీక్ష ఇదే!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన `నరసింహా` (పడయప్పా) పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయింది.
By: Sivaji Kontham | 22 Oct 2026 7:00 AM ISTసూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన `నరసింహా` (పడయప్పా) పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమాలో రజినీకాంత్ అద్భుత నటనా వైభవానికి తోడుగా.. అతడికి ధీటుగా పోటీ పడుతూ రమ్యకృష్ణ నీలాంబరి పాత్రతో ప్రదర్శించిన నటన నభూతో నభవిష్యత్ అనిపించింది. ఇప్పటికీ నీలాంబరి పాత్రను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. రజినీ కెరీర్‌లోని గ్రేట్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడొస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో దశాబ్దాలుగా ఉంది. ఇటీవల `పడయప్పా` రీ-రిలీజ్ అయి సంచలన ఆదరణ పొందడంతో సీక్వెల్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే రీ-రిలీజ్ వసూళ్లు సినిమాపై ఉన్న అభిమానాన్ని చూపిస్తాయి తప్ప.. కొత్తగా వచ్చే సీక్వెల్ విజయానికి హామీ కావు. కేవలం పాత సినిమా విజయాన్ని నమ్ముకుని సీక్వెల్ తెస్తే వర్కవుట్ కాదు.. కొత్త భాగంలో అసలైన విషయం ఉండటం అత్యంత ముఖ్యం.
1999లో వచ్చిన మొదటి భాగంలో నీలాంబరి పాత్ర చివర్లో మరణిస్తుంది. అలాంటి ఐకానిక్ పాత్ర లేకుండా `నరసింహా` సీక్వెల్ ఊహించడం కష్టం. ఈ క్రమంలోనే నీలాంబరి పునర్జన్మ ఎత్తి నరసింహాపై ప్రతీకారం తీర్చుకునే ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పునర్జన్మ కథను నేటి తరం ప్రేక్షకులు మెచ్చేలా.. ఎక్కడా నాటకీయత ఎక్కువ కాకుండా కొత్తగా.. ఉత్కంఠభరితంగా చెప్పడమే అసలైన సవాలు. ఒక క్లాసిక్ సినిమాలోని పాత్రలను మళ్లీ తెరపైకి తెచ్చేటప్పుడు కథాంశం, పాత్రలు ఎంత బలంగా ఉంటే.. సీక్వెల్ ఆ స్థాయిలోనే నిలబడుతుంది.
ఈ ప్రాజెక్ట్ ప్రకటనలో ఆలస్యం జరగడానికి ప్రధాన కారణం రజినీకాంత్ తీసుకుంటున్న జాగ్రత్తలే. దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పిన కథాంశం ఆసక్తికరంగా ఉన్నా.. ఇంకా స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లేపై మరిన్ని కసరత్తులు అవసరమని రజినీ భావిస్తున్నారట. నేటి ట్రెండ్‌కి తగ్గట్టు కథనాన్ని పటిష్టం చేస్తేనే ముందుకు వెళ్లాలని ఆయన వేచి చూస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు-హీరో కాంబినేషన్ ఎన్నో విజయాలు అందించినా.. నేటి ప్రేక్షకుల అభిరుచులు, సినిమాలను చూసే కోణం పూర్తిగా మారిపోయాయి. కాబట్టి 90ల నాటి ఫార్ములాను పక్కన పెట్టి.. కేఎస్ రవికుమార్ నేటి ప్రేక్షకుల కనెక్టివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడం చాలా కీలకం.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో పాత హిట్ సినిమాల బ్రాండ్ విలువను, టైటిల్స్‌ను ఉపయోగించుకుని సీక్వెల్స్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే బ్రాండ్ నేమ్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడటం లేదు. కథలో కొత్తదనం, ఆకట్టుకునే కథనం లేకపోతే డిజాస్టర్లుగా మిగిలే ప్రమాదం కూడా ఉంది. రజినీకాంత్ అభిమానులు `నరసింహా-2` నుంచి ఒక సాదాసీదా సినిమాను ఆశించడం లేదు. కథ, విలనిజం, ఏఆర్ రెహమాన్ స్థాయి సంగీతం, వేగవంతమైన స్క్రీన్‌ప్లే.. ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ అత్యున్నత నాణ్యతను ఆశిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాలను అందుకోవడమే ఈ సీక్వెల్‌కు అసలైన పరీక్ష.
మొత్తానికి `నరసింహా-2`కు పాత సినిమా క్రేజ్ ఒక గొప్ప ప్లస్ పాయింట్ అనడంలో సందేహం లేదు. కానీ అదే క్రేజ్ భారీ అంచనాల భారంగా మారి సినిమాపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. ఈ క్లాసిక్ ప్రాజెక్టు నిజంగా పట్టాలెక్కుతుందా... దర్శకరచయితలు సిద్ధం చేస్తున్న స్క్రిప్ట్ ఏ తీరుగా రూపాంతరం చెందుతోంది? దీనిపై రజినీకాంత్ అధికారికంగా ఎప్పుడు ఓకే చెప్తారు? అనే అంశాలు ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
