Begin typing your search above and press return to search.

తలైవా 173: విజయ్ కోసం స్టాలిన్ పొలిటికల్ స్క్రీన్ ప్లేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా అనగానే కోలీవుడ్ లో హడావుడి మాములుగా లేదు.

By:  M Prashanth   |   7 Jan 2026 9:25 AM IST
తలైవా 173: విజయ్ కోసం స్టాలిన్ పొలిటికల్ స్క్రీన్ ప్లేనా?
X

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా అనగానే కోలీవుడ్ లో హడావుడి మాములుగా లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ వెనుక కేవలం సినిమాటిక్ బిజినెస్ మాత్రమే కాదు, అంతకు మించిన పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ కోలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఇన్నేళ్లు లేనిది సడన్ గా ఈ ఇద్దరు దిగ్గజాలు కలవడం, అది కూడా తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆయన పాలిటిక్స్ లోకి వస్తారని ఫ్యాన్స్ ఎదురుచూసినా, చివరి నిమిషంలో ఆరోగ్యం సహకరించక వెనక్కి తగ్గారు. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా, ఆయన మాటకి, ఆయన మద్దతుకి ఉన్న విలువ ఇంకా తగ్గలేదు. సరిగ్గా ఈ పాయింట్ నే ఇప్పుడు అధికార డీఎంకే పార్టీ తెలివిగా వాడుకుంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం తమిళనాడులో దళపతి విజయ్ రూపంలో స్టాలిన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో విజయ్ ని ఎదుర్కోవడానికి డీఎంకేకి బలమైన అస్త్రం కావాలి. ఆ అస్త్రమే రజినీకాంత్. అయితే రజినీ డైరెక్ట్ గా స్టాలిన్ కి సపోర్ట్ చేస్తే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మధ్యలో కమల్ హాసన్ ని వాడుతున్నారనేది విశ్లేషకుల మాట. కమల్ హాసన్ ఇప్పటికే తన పార్టీని డీఎంకేకి దగ్గర చేసి, రాజ్యసభ ఎంపీగా కూడా వెళ్లారు. ఇప్పుడు కమల్ ద్వారా రజినీని లైన్ లో పెట్టడం స్టాలిన్ వ్యూహంగా కనిపిస్తోంది.

ఈ సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించినా, దీనికి సంబంధించిన హడావిడి, షూటింగ్ అప్డేట్స్ అన్నీ 2026 ఎన్నికల టైమ్ లోనే ఉంటాయి. అంటే ఎలక్షన్ హీట్ లో రజినీ, కమల్ కలిసి ప్రయాణించడం వల్ల ఇద్దరి ఫ్యాన్ బేస్ ఒక్కటయ్యే అవకాశం ఉంది. రజినీకాంత్ ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా కమల్ వైపు, తద్వారా పరోక్షంగా డీఎంకే వైపు మొగ్గు చూపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది విజయ్ ఓటు బ్యాంకుకి గండి కొట్టడానికి వేసిన స్కెచ్ లా అనిపిస్తోంది.

నిజానికి ఇదంతా రజినీకాంత్ కి తెలియకుండా జరుగుతుందనుకోవడం పొరపాటే. అలాగని బహిరంగంగా ఓపెన్ కాలేరు. అందుకే తన మిత్రుడు కమల్ హాసన్ ద్వారా పరోక్షంగా అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారని టాక్. "మేము స్నేహితులం" అనే ట్యాగ్ లైన్ తో సినిమా చేస్తే, రాజకీయంగా ఎలాంటి విమర్శలు రావు, కానీ జరగాల్సిన మేలు మాత్రం అధికార పార్టీకి జరుగుతుంది. ఏదేమైనా విజయ్ ని రాజకీయంగా దెబ్బకొట్టాలంటే రజినీకాంత్ గ్లామర్ ని వాడక తప్పని పరిస్థితి. అది డైరెక్ట్ గా కుదరదు కాబట్టి, కమల్ హాసన్ అనే బ్రిడ్జ్ ద్వారా ఈ ఆపరేషన్ నడిపిస్తున్నారని అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ సినిమాటిక్ పొలిటికల్ డ్రామాలో విజయ్ ఎలా నెగ్గుకువస్తారో, తలైవా ఫ్యాన్స్ ఎటువైపు నిలబడతారో చూడాలి.