జైలర్ 2.. స్టార్స్ ను గట్టిగానే దింపుతున్నాడు కానీ..
'జైలర్ 2' గురించి వస్తున్న అప్‌డేట్స్ చూస్తుంటే డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.
By: M Prashanth | 30 Oct 2025 10:27 AM IST'జైలర్ 2' గురించి వస్తున్న అప్‌డేట్స్ చూస్తుంటే డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇది 'జైలర్'కు సీక్వెల్‌లా లేదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలన్నిటినీ ఒకే స్క్రీన్‌పైకి తెస్తున్నట్లుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ లీడ్ చేస్తుండగా, ఫస్ట్ పార్ట్‌లో క్లైమాక్స్‌ను షేక్ చేసిన శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ ఈసారి కూడా కంటిన్యూ అవుతున్నారని టాక్.
అయితే, ఈసారి లిస్ట్ ఇక్కడితో ఆగలేదు. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా, ఈ గ్యాంగ్‌లోకి నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు, మలయాళం నుంచి ఫహాద్ ఫాసిల్, బాలీవుడ్ నుంచి విద్యా బాలన్, తమన్నా పేర్లు కూడా బజ్‌లో ఉన్నాయి. ఇక కోలీవుడ్ నుంచి ఎస్.జె. సూర్య, సంతానం, సూరజ్ వెంజరమూడు.. ఇలా లిస్ట్ చూస్తుంటేనే హైప్ మాక్స్ రేంజ్‌కి వెళ్లిపోయింది.
కానీ, ఇక్కడే అసలు భయం మొదలవుతోంది. 'జైలర్ 1' సూపర్ హిట్ అయి ఉండొచ్చు, కానీ ఆ సినిమాను నిలబెట్టింది నెల్సన్ కంటెంట్ కంటే ఎక్కువగా అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం అని చాలా మంది నమ్ముతారు. స్వయంగా రజినీకాంత్ కూడా ఇదే మాట చెప్పారు. ఆఖరి 20 నిమిషాల్లో వచ్చిన క్యామియోలు సినిమా రేంజ్‌ను మార్చేశాయి తప్ప, సినిమా మొత్తం గ్రిప్పింగ్‌గా ఉందనే టాక్ రాలేదు. ఇక విడుదలైన టైమింగ్ హెల్ప్ అవ్వడంతో సినిమా లెక్క 800 కోట్లకు వెళ్ళింది.
ఇప్పుడు నెల్సన్ మళ్లీ అదే ఫార్ములాను నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. కేవలం స్టార్ పవర్‌ను నమ్ముకుని సినిమా తీస్తే ఏమవుతుందో రీసెంట్‌గా 'కూలీ'తో లోకేష్ కనగరాజ్ ప్రూవ్ చేశాడు. 'కూలీ' కోసం రజినీకాంత్‌తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి భారీ స్టార్లను తీసుకొచ్చారు. కానీ, కంటెంట్ వీక్‌గా ఉండటంతో సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. చివరికి అనిరుధ్ మ్యూజిక్ కూడా ఆ సినిమాను కాపాడలేకపోయింది.
ఇప్పుడు నెల్సన్ కూడా 'కూలీ' చేసిన తప్పే చేస్తున్నాడా? రజినీ, బాలయ్య, మోహన్‌లాల్, ఫహాద్.. ఇంత మంది పవర్‌హౌస్ పెర్ఫార్మర్లను పెట్టుకుని, వాళ్లకు బలమైన పాత్రలు రాశాడా? లేక కేవలం వాళ్ల స్టార్‌డమ్‌ను క్యామియోల కోసం వాడుకుంటున్నాడా? అనేది పెద్ద ప్రశ్న. 'కూలీ' రిజల్ట్ తర్వాత ఆడియెన్స్‌కు ఒకటి క్లియర్‌గా అర్థమైంది. వాళ్లకు స్టార్ల జాతర కాదు, సాలిడ్ కథ కావాలి. ఇప్పుడు నెల్సన్ చేతిలో ఆ కథ ఉందా లేక స్టార్లను చూపిస్తూ మళ్లీ అనిరుధ్ మ్యూజిక్‌పైనే భారం వేస్తాడా అనేది చూడాలి.
