జైలర్ 2 ఓపెనింగ్స్.. ఈ రేంజ్ నెంబర్లు సరిపోతాయా?
కానీ 'జైలర్ 2' విషయంలో అదే ఫిగర్ వస్తే సరిపోతుందా? ఎందుకంటే మూడేళ్ల క్రితం వచ్చిన మొదటి 'జైలర్' కూడా దాదాపు వంద కోట్ల ఓపెనింగ్ అందుకుంది.
By: M Prashanth | 13 Oct 2026 4:00 PM ISTరజనీకాంత్ సినిమా మొదటి రోజు వంద కోట్లు వసూలు చేసిందంటే పెద్ద విషయమే. కానీ 'జైలర్ 2' విషయంలో అదే ఫిగర్ వస్తే సరిపోతుందా? ఎందుకంటే మూడేళ్ల క్రితం వచ్చిన మొదటి 'జైలర్' కూడా దాదాపు వంద కోట్ల ఓపెనింగ్ అందుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో సీక్వెల్ వస్తుండటంతో అంచనాలు ఇంకాస్త పెరిగాయి. పైగా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉండటంతో మొదటి రోజు ఈసారి కూడా రూ.100 కోట్లకు పైగా వరకు రావచ్చనే లెక్కలు కూడా వినిపిస్తున్నాయి.
2023 ఆగస్టులో విడుదలైన 'జైలర్' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.96.36 కోట్ల గ్రాస్ సాధించింది. ఇండియాలో రూ.56.36 కోట్లు రాగా, ఓవర్సీస్ నుంచి ఏకంగా రూ.40 కోట్లు వచ్చాయి. దేశీయంగా నెట్ కలెక్షన్ రూ.48.35 కోట్లు. అప్పట్లో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోనూ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా విదేశీ మార్కెట్ రజనీ సినిమాకు ఎంత బలంగా ఉందో ఈ లెక్కలు చూపించాయి.
ఇప్పుడు 'జైలర్ 2' అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే తరహాలో సాగుతున్నాయి. అక్టోబర్ 12 సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు టికెట్ల ప్రీ సేల్స్ రూ.37 కోట్ల మార్కును దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ట్రేడ్ అనలిస్ట్ లు రూ.40 కోట్ల వరకు బుకింగ్స్ జరిగినట్లు అంచనా వేశారు. ఇంకా కొన్ని చోట్ల షోలు పూర్తిగా ఓపెన్ కావాల్సి ఉంది. దీంతో విడుదల రోజు నాటికి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
అయితే అంచనాల ప్రకారం 'జైలర్ 2' తొలి రోజు రూ.130 నుంచి 150 కోట్ల మధ్య ప్రపంచవ్యాప్త గ్రాస్ అందుకోవచ్చు అనే టాక్ వస్తోంది. అదే జరిగితే మొదటి పార్ట్ కంటే దాదాపు 50 కోట్లు అదనంగా రావాలి. ఇది సాధించాలంటే తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు అవసరం. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి రావడం కలెక్షన్లకు ఉపయోగపడొచ్చు. కానీ టికెట్ ధరలు పెరిగితే గ్రాస్ పెరుగుతుంది తప్ప అదే స్థాయిలో ప్రేక్షకుల సంఖ్య పెరిగినట్లు కాదు.
ఇక హిందీ మార్కెట్ విషయంలో ఈసారి ఒక సమస్య ఎదురైంది. నాలుగు వారాల ఓటీటీ గ్యాప్ కారణంగా పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి పెద్ద మల్టీప్లెక్స్ చెయిన్లలో హిందీ వెర్షన్ విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే మొదటి పార్ట్‌కు హిందీ నుంచి వచ్చిన వసూళ్లు చాలా తక్కువ. కాబట్టి దీని ప్రభావం మొత్తం ఓపెనింగ్ మీద ఎంత ఉంటుందో చూడాలి. మరోవైపు అక్టోబర్ 16న 'రణబాలి' వస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు నుంచి థియేటర్ల పోటీ కూడా ఉండొచ్చు.
కేరళలో మాత్రం 'జైలర్ 2' బుకింగ్స్ ప్రారంభమైన గంటలోనే రూ.1.61 కోట్ల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. అక్కడ దాదాపు 800 స్క్రీన్లలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తుండటం కేరళ మార్కెట్‌కు మరో ప్లస్ కావచ్చు. నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన 'జైలర్ 2' అక్టోబర్ 15న విడుదలవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. ఎస్.జె.సూర్య, విద్యాబాలన్, శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
