ఒకే షో.. మూడు తరాలు.. ఇది 'రజినీ' మ్యాజిక్!
ఈ మూడు వర్గాల ప్రేక్షకులను ఒకేసారి థియేటర్ కు రప్పించే స్టామినా ఉన్న హీరో ఇప్పుడు భారతదేశంలోనే లేడు. కానీ ఒకే ఒక్క నటుడికి మాత్రం ఇది సాధ్యమైంది.
By: M Prashanth | 15 Oct 2026 2:07 PM ISTఈ రోజుల్లో 70 ఏళ్లు దాటిన పెద్దవాళ్లు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడమే చాలా అరుదు. మరోవైపు నేటితరం 'జెన్ జీ' పిల్లలు ఓటీటీలకు, హాలీవుడ్ వెబ్ సిరీస్ లకు అలవాటు పడిపోయారు. వాళ్లు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు చూడడమే తక్కువ. తాత, తండ్రి, పిల్లలు.. ఈ మూడు జనరేషన్ల ఆలోచనలు, అభిరుచులకు మధ్య ఎంతో గ్యాప్ ఉంటుంది. ఈ మూడు వర్గాల ప్రేక్షకులను ఒకేసారి థియేటర్ కు రప్పించే స్టామినా ఉన్న హీరో ఇప్పుడు భారతదేశంలోనే లేడు. కానీ ఒకే ఒక్క నటుడికి మాత్రం ఇది సాధ్యమైంది.
ఆయన వయసు అక్షరాలా 75 ఏళ్లు. యువతను ఆకర్షించడానికి ఆయన కుర్రాడిలా కనిపించాల్సిన పనిలేదు, పెద్దవాళ్ల కోసం మెసేజ్ లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన స్క్రీన్ మీద నడిచి వస్తే చాలు. ఈ రోజు నా మిత్రుడి జీవితంలో ఎదురైన ఒక ఊహించని మూమెంట్ ద్వారా ఆయన క్రియేట్ చేసిన ఈ మ్యాజిక్ ఏంటో నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే నా ఫ్రెండ్ కే ఈ మూమెంట్ ఒక పెద్ద సర్ ప్రైజ్.
ఈ రోజు ఉదయం 8 గంటలకు నేను నా మిత్రుడు 'జైలర్ 2' మార్నింగ్ షోకు వెళ్లాము. థియేటర్ లో కూర్చున్న కాసేపటికి అటుగా చూస్తే అతనికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కొన్ని సీట్ల అవతల వాళ్ల నాన్నగారు కూర్చుని ఉన్నారు. ఇంకొంచెం పక్కకు చూస్తే తన పిల్లలు తమ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి రచ్చ చేస్తున్నారు. ఇంట్లో ఎవరికీ ఎవరూ చెప్పుకోలేదు, కనీసం కలిసి వెళ్దామని ప్లాన్ కూడా చేసుకోలేదు. తీరా చూస్తే ఒకే థియేటర్ లో ఒకే షోకు వాళ్ల ఫ్యామిలీలోని మూడు తరాల వాళ్లు సైలెంట్ గా ప్రత్యక్ష మయ్యారు.
ఇంకా విచిత్రం ఏంటంటే, తన పిల్లలు ఈరోజు థియేటర్ కు రావడం కోసం నిన్న రాత్రే 'జైలర్ 1' మళ్లీ చూసి మరీ రెడీ అయ్యారట. వాళ్ల నాన్న పాత తరం క్లాసిక్స్ చూస్తారు, తను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూస్తాడు, పిల్లలు కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతారు. ముగ్గురి మైండ్ సెట్స్ వేరు. కానీ ఏ ప్లానింగ్ లేకుండా ఒకే స్క్రీన్ ముందుకు ఆ ముగ్గుర్నీ ఏకకాలంలో లాక్కొచ్చిన ఆ ఆకర్షణే సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పవర్ ఏంటో ఆ క్షణం నాకు, నా మిత్రుడికి క్లియర్ గా తెలిసొచ్చింది.
వాళ్ల నాన్న కాలంలో నరసింహ, బాషా సినిమాలతో రజినీ మేనియా మొదలైంది. నా ఫ్రెండ్ తరం వచ్చేసరికి శివాజీ, రోబో అంటూ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ ఓటీటీ జనరేషన్ పిల్లలు కూడా ఆయన స్టైల్ కు, హుకుం స్వాగ్ కు థియేటర్లలో విజిళ్లు వేస్తున్నారు. తాత, తండ్రి, గ్రాండ్ చిల్డ్రన్స్.. ఒకే హీరో కోసం ఒకే థియేటర్ లో టికెట్లు కొనుక్కుని పోటీ పడటం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరెక్కడా చూడలేం.
సినిమా చూసి బయటకు వచ్చాక వాళ్లంతా ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యంగా నవ్వుకున్నారట. వందల కోట్ల కలెక్షన్లు, ఇండస్ట్రీ హిట్లు అనేవి వ్యాపార పరంగా ఎవరైనా కొట్టొచ్చు. కానీ 75 ఏళ్ల వయసులో కూడా తన కంటే అరవై ఏళ్లు చిన్నవాళ్లైన నేటి కుర్రాళ్లను సైతం మార్నింగ్ షోలకు పరుగులు పెట్టించడం రజినీకి మాత్రమే దక్కిన వరం. తరాలు మారినా ఆయన క్రేజ్ మాత్రం నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్!
- Editor
