చిరూ, బాలయ్య ప్లాన్స్ ను రజినీ మారుస్తారా?
తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాను దసరా సీజన్‌కు రెడీ చేసే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 26 Jun 2026 4:18 PM ISTభారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు భాషల్లో సీక్వెల్స్ భారీ వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు భరోసానిస్తున్నాయి. ఒక సినిమా సక్సెస్ అయితే దానికి కంటిన్యూగా వచ్చే సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో మొదటి భాగం సృష్టించిన అంచనాలను అందుకోవాల్సిన ఒత్తిడి కూడా డైరెక్టర్లు, హీరోలపై పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్2 ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాను దసరా సీజన్‌కు రెడీ చేసే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాకపోయినా, ఈ వార్తతోనే దసరా బాక్సాఫీస్ సమీకరణాలపై చర్చ మొదలైంది. పండుగ సీజన్‌లో ఆడియన్స్ రద్దీ ఎక్కువగా ఉండటంతో స్టార్ హీరోల సినిమాలకు ఇది అత్యంత కీలకమైన విండోగా భావిస్తారు. అలాంటి టైమ్ లో జైలర్2 వస్తే సౌత్ మార్కెట్‌లో భారీ పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం అదే సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం, అలాగే సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు వంటి సినిమాల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటికి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా ఇప్పటివరకు రాలేదు. దీంతో వీటిలో ఏ సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. అందుకే జైలర్2 రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తే, మిగతా సినిమాల షెడ్యూల్స్‌పైనా ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు సీక్వెల్స్ విషయంలో ప్రేక్షకుల అంచనాలు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. కేవలం స్టార్ హీరో ఇమేజ్ సరిపోదు. కథలో కొత్తదనం, యాక్షన్ ఎలివేషన్స్, ఎమోషన్స్, విజువల్ స్కేల్ అన్నీ కలిసొస్తేనే సెకండ్ పార్ట్ సక్సెస్ అవుతోంది. మొదటి భాగాన్ని మించి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలనే ప్రెజర్ ప్రతి సీక్వెల్‌పై కనిపిస్తోంది. జైలర్ ఫస్ట్ పార్ట్ కమర్షియల్‌గా అందుకున్న సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు మరింత పెరగడం సహజమే. తెలుగు రాష్ట్రాల్లో కూడా జైలర్ 2పై ఆసక్తి తక్కువేమీ లేదు. మొదటి భాగం తర్వాత రజనీకాంత్ మార్కెట్‌కు మళ్లీ ఊపు రావడంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పై ముందుగానే డిస్కషన్స్ మొదలైనట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవకపోవడంతో బిజినెస్ డీల్స్ పూర్తి స్థాయిలో ముందుకు సాగడం లేదని సమాచారం. అందుకే బయ్యర్లు కూడా వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన రావాలని ఎదురుచూస్తున్నారు.
మొత్తంగా చూస్తే, జైలర్ 2 కేవలం మరో సీక్వెల్ మాత్రమే కాదు. దసరా బాక్సాఫీస్ సమీకరణాలను మార్చే సామర్థ్యం ఉన్న స్టార్ ప్రాజెక్ట్‌గా మారుతోంది. రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిన వెంటనే దసరా రేసు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ప్రచారంలో ఉన్నట్లుగానే పండుగ బరిలోకి జైలర్2 అడుగుపెడితే, ఈ ఏడాది దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ఉత్కంఠభరితమైన బాక్సాఫీస్ పోరాటానికి తెరలేవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
