మలేషియాపై కోలీవుడ్ స్పెషల్ ఫోకస్ ఎందుకంటే?
కోలీవుడ్ అగ్రతారలు అంతర్జాతీయ వేదికలపై తమ ముద్రను వేయడానికి మలేషియాను ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
By: Srikanth Kontham | 15 July 2026 4:00 PM ISTకోలీవుడ్ అగ్రతారలు అంతర్జాతీయ వేదికలపై తమ ముద్రను వేయడానికి మలేషియాను ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమిళ చలనచిత్రాలకు మలేషియా బలమైన మార్కెట్‌గా ఎదిగిందన్నది కాదన లేని నిజం. అక్కడ ఉన్న భారీ తమిళ జనాభా.. ఆదరణ దృష్ట్యా స్టార్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్లు, ఆడియో లాంచ్ ఈవెంట్స్ , షూటింగ్ షెడ్యూల్స్ కోసం ఆ దేశాన్ని ప్రాధాన్యతగా మారుస్తున్నారు. గత కొద్దికాలంగా మలేషియాలో తమిళ సినిమాల ప్రభావం గణనీయంగా పెరిగింది. అక్కడి బహుళ సంస్కృతుల సమాజంలో తమిళ భాషా సంస్కృతి, కళలు దశాబ్దాలుగా సజీవంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటులు తమ సినిమా వేడుకలను ఇక్కడ నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు మరింత దగ్గరవ్వాలని ఆశిస్తున్నారు. ఇది కేవలం మార్కెటింగ్ వ్యూహం మాత్రమే కాదు. ఒక సాంస్కృతిక అనుసంధానం కూడా. ఈ వరుసలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న 'జైలర్ 2' చిత్రంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ ఆడియో లాంచ్ వేడుకను మలేషియాలో అత్యంత భారీగా నిర్వహించాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రజినీకాంత్ అంటేనే అక్కడ ప్రత్యేకమైన క్రేజ్.
అలాంటి స్టార్ చిత్రం కోసం మలేషియా స్టేడియాలలో ఈవెంట్ ప్లాన్ చేయడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇటీవల నటుడు విజయ్ తన 69వ చిత్రం `జన నాయగన్` ఆడియో వేడుకను కౌలాలంపూర్‌లోని బుకిత్ జలీల్ నేషనల్ స్టేడియంలో నిర్వహించి సంచలనం సృష్టించారు. సుమారు 80,000 మందికి పైగా అభిమానులు హాజరైన ఈ వేడుక మలేషియాలో తమిళ సినిమాలకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. విజయ్ ప్రసంగం ,ఆ కార్యక్రమ నిర్వహణ అక్కడి తమిళ సమాజంతో ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పాయి.
కేవలం ప్రమోషన్లకే పరిమితం కాకుండా షూటింగ్ లొకేషన్లుగా కూడా మలేషియాను ఎంపిక చేసుకోవడం పెరిగింది. అందమైన ప్రకృతి దృశ్యాలు, సినిమాటిక్ లొకేషన్లు , అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉండటం దర్శక నిర్మాతలకు కలిసొస్తుంది. గతంలో కూడా అనేక తమిళ చిత్రాలు మలేషియా నేపథ్యంతో తెరకెక్కి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు కోలీవుడ్ గ్లోబల్ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిర్మాతలు కూడా భారీ వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్స్ నిర్వహించడానికి వెనుకాడటం లేదు.
ఎందుకంటే? ఇలాంటి వేడుకల ద్వారా వచ్చే గుర్తింపు సినిమా ఓపెనింగ్స్ , బాక్సాఫీస్ కలెక్షన్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందనేది వారి నమ్మకం. భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఇక్కడి నుంచే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది. తమిళ సినీ పరిశ్రమ మలేషియాను పవర్‌హౌస్‌గా భావిస్తుండటం ఈ దేశం - కోలీవుడ్ మధ్య ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. స్టార్ల రాకతో మలేషియాలోని తమిళ అభిమానుల సంబరాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి.
