తలైవాకు 50ఏళ్లు.. IFFI వేడుకల్లో ఘన సన్మానం
ఒక సాధారణ బస్ కండక్టర్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కళాకారుడిగా అత్యంత కీలక భూమిక పోషిస్తాడని ఆరోజు ఎవరూ ఊహించి ఉండరు.
By: Sivaji Kontham | 8 Nov 2025 10:00 PM ISTఒక సాధారణ బస్ కండక్టర్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కళాకారుడిగా అత్యంత కీలక భూమిక పోషిస్తాడని ఆరోజు ఎవరూ ఊహించి ఉండరు. గాల్లో సిగరెట్ ఎగురవేసినా.. ఫంక్‌ని నుదుటి మీదకు విసిరినా.. చొక్కా కాలర్ మెలి తిప్పినా, చేతిని మడత పెట్టినా ప్రతిదీ ఒక ఇస్టయిల్ అని బస్ లో ప్రయాణీకులు భావించేవారు. శివాజీరావ్ గైక్వాడ్ (రజనీకాంత్ సినిమాల కోసం పెట్టిన పేరు)లో ఏదో మ్యాజిక్ ఉంది.. మిరాకిల్స్ చేస్తాడని చూసిన ప్రతి ఒక్కరూ అనుకునేవారు. నిజానికి అంత పెద్ద విషయం తనలో ఉందని శివాజీ రావ్ కూడా గ్రహించి ఉండడు.
అప్పట్లో ఒక బస్ కండక్టర్‌కి సినీరంగంలో ఎలాంటి అవకాశాలొస్తాయో కూడా ఊహించనిది. కానీ అతడు ఈ రంగంలోకి వచ్చాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన నటుడిగా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. ఐదు దశాబ్ధాలుగా ఎదురేలేని స్టార్ గా హవా సాగించాడు. ఇప్పటికీ 70 పైబడిన వయసులో అతడు చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. నేటితరం హీరోలతో పోటీపడుతూ 500 కోట్ల క్లబ్ హీరోగా సత్తా చాటిన సూపర్ స్టార్. రజనీ గురించి వర్ణించాలంటే పదాలు చాలవు.
అందుకే ఇప్పుడు ఆయనను అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (IFFI)లో సన్మానించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 20న గోవాలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో సినిమాల ఆవిష్కరణ, అంతర్జాతీయ సినీ సహకారంపై బోలెడంత చర్చ జరగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చలనచిత్రోత్సవం, హ్యాకథాన్ , సినిమా- సాంకేతికత మధ్య పెరుగుతున్న సంబంధం గురించి చర్చోపచర్చలు జరగనున్నాయి. దేశీ సినిమాకి ఈ వేడుక అత్యంత కీలకమైనది. ఇలాంటి వేదికపై సినీరంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ముగింపు వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సత్కరిస్తారు. ఇదే వేదికపై చిత్రనిర్మాతలు గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్, పి. భానుమతి, భూపేన్ హజారికా, సలీల్ చౌదరికి శతాబ్ది నివాళులు అర్పిస్తారు.
ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న పలువరు సినీ దిగ్గజాలు పాల్గొననున్నారు. విధు వినోద్ చోప్రా, ఆమీర్ ఖాన్, అనుపమ్ ఖేర్, రవి వర్మన్, సుహాసిని మణిరత్నం, శ్రీకర్ ప్రసాద్ సహా టాప్ టెక్నీషియన్స్ 21 మాస్టర్ క్లాసులు తీసుకుంటారు. డిజిటల్ యుగంలో ఎడిటింగ్, నటన సహా చాలా అంశాలపై టాపిక్స్ ని చర్చిస్తారు. తొమ్మిది రోజుల ఉత్సవంలో 81 దేశాల నుండి 240 కి పైగా సినిమాలు ప్రదర్శితమవుతాయి. ఈ సంవత్సరం 50 మందికి పైగా మహిళా దర్శకులు తమ చిత్రాలను ప్రదర్శించడం ఉత్కంఠను కలిగించే మరో విషయం. ఈసారి గోవా ఉత్సవాలలో రాజమౌళి వంటి దిగ్గజం కూడా చేరేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.
