మళ్లీ హిమాలయాలకు సూపర్ స్టార్!
సూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయసులో కూడా వరుసగా యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు.
By: Madhu Reddy | 5 Oct 2025 4:53 PM ISTసూపర్ స్టార్ రజినీకాంత్ ఏడు పదుల వయసులో కూడా వరుసగా యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు కూడా చేయలేని సాహసాలను.. ఆయన ఈ వయసులో చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కూడా.. ఇదిలా ఉండగా చివరిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఆగస్టు 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ఖచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరుతుందని.. కోలీవుడ్ సినీ పరిశ్రమకు మంచి పేరు తీసుకొస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కథ బలం లేకపోవడం వల్లే సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని బోల్తా కొట్టింది. దీంతో ఇటు చిత్ర బృందంతో పాటు అటు కోలీవుడ్ కూడా నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈయన ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ' జైలర్ 2' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు ఈ షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది.. కారణం రజినీకాంత్.. మరొకసారి హిమాలయాల్లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సూపర్ స్టార్ మళ్లీ హిమాలయాలకు వెళ్లడం వెనుక అసలు కారణం ఏంటి? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక అనుభూతి, మానసిక ప్రశాంతత పొందడానికి తరచూ హిమాలయాలకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరొకసారి హిమాలయాలకు బయలుదేరారు. రిషికేశ్ ఆశ్రయంలో బసచేస్తూ బద్రీనాథ్, మహావతార్ బాబాజీ గుహ వంటి పవిత్ర స్థలాలను సందర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మళ్లీ సూపర్ స్టార్ హిమాలయాలకు వెళ్లారా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లడంపై స్పందిస్తూ.." ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తే నాకు ఒక కొత్త అనుభవం కలుగుతుంది. ఈసారి కూడా ఆ కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఎదురు చూస్తున్నాను. ప్రపంచం అంతటికీ ఆధ్యాత్మికత అవసరం. అది మనిషికి తృప్తిని, ప్రశాంతతను ఇస్తుంది. భగవంతుడి మీద విశ్వాసమే జీవితంలో సమతుల్యతను సాధిస్తుంది" అంటూ రజినీకాంత్ కామెంట్లు చేశారు.
ఇదిలా ఉండగా ఇటీవల అబుదాబీ పర్యటనకు వెళ్లిన రజనీకాంత్.. పర్యటనను ముగించుకొని భారత్ కి చేరుకున్నారు. ఆ మరుసటిరోజే హిమాలయాలకు బయలుదేరారు. ఇందులో భాగంగానే ఇలా పలు ప్రదేశాలను సందర్శిస్తూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తూ ప్రశాంతతను పొందే ప్రయత్నం చేస్తున్నారు రజినీకాంత్.
హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత జైలర్ 2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇందులో మోహన్ లాల్ , శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
