అరుణాచలం.. అంటే.. అంతే.. రజనీకాంత్ ఏం చేశారంటే!
అరుణాచలం.. అనగానే తెలుగు వారికి గుర్తుకు వచ్చే పేరు ప్రముఖ సినీ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.
By: Garuda Media | 26 Jan 2026 4:00 PM ISTఅరుణాచలం.. అనగానే తెలుగు వారికి గుర్తుకు వచ్చే పేరు ప్రముఖ సినీ నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. కర్ణాటకకు చెందిన ఆయన.. తమిళనాడులో స్థిరపడినా.. రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకున్నారు. అంత్యంత నిరాడంబరంగా ఉండే.. రజనీకాంత్.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.. తన అభిమానులతో ప్రశంసలు అందుకుంటూనే ఉంటారు. తాజాగా కూడా అలాంటి ఘటనే జరిగింది.
వీధుల్లో పరాటాలు అమ్ముకునే ఓ వ్యక్తిని ఇంటికి పిలిచి.. సత్కరించారు. ఓ బంగారు గొలుసును మెడలో అలంకరించి.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణం.. తనకంటే.. కూడా పరాటాలు అమ్ముకునే వ్యక్తి చేస్తున్న సేవ గొప్పదని రజనీ భావించారట!. దీంతో ఆ చిరు వ్యాపారిని ఇంటికి పిలిచి.. స్వయంగా ఆహ్వానం పలికి.. పసిడి గొలుసుతో సత్కరించారు.
విషయం ఏంటి?
తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన శేఖర్.. పరాటాల వ్యాపారం చేస్తున్నాడు. సహజంగా.. ప్లేటు పరాటా ఎంత లేదన్నా.. రూ.30-40 వరకు ఉంది. ఈయనకూడా అదే రేటుకు విక్రయిస్తున్నారు కానీ, పేదలు.. ఆకలితో ఉన్న వారు ఎవరైనా వస్తే.. మాత్రం వారి వద్ద రూపాయి తీసుకోకుండా.. ఒక్కొక్కసారి రూ.5 కే పరాటాలు ఇస్తున్నాడు. ఇది.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇక, శేఖర్‌కు మరో లక్షణం కూడా ఉంది.
ఆయన రజనీకి వీరాభిమాని. తమిళ సూపర్ స్టార్ మూవీ విడుదలైందంటే..చాలు.. తొలి రోజు తొలి ఆట చూసేయాల్సిందే.. విజిల్స్ కొట్టాల్సిందే.. అన్నట్టుగా శేఖర్ వ్యవహరిస్తాడు. అంతేకాదు.. ఆయన చేతిపై రజనీ పేరును పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అయితే.. రజనీకాంత్.. తన పేరును పచ్చ వేయించుకున్నందుకు పొంగిపోలేదు... పేదలకు.. ఆకలితో ఉన్నవారికి శేఖర్ చేస్తున్న సేవకు ఫిదా అయ్యారు. శేఖర్ కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించారు. శాలువాతో సన్మానించి, బంగారు గొలుసును కానుకగా అందించారు.
