Begin typing your search above and press return to search.

రజనీ 'ధర్మన్‌'పై 'దురంధర్' ప్రభావం.. ఫ్యాన్స్ బిగ్ డిమాండ్!

ఇటీవల బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దురంధర్, దురంధర్ 2 చిత్రాల అద్భుత విజయం..ఈ సినిమాల‌ మేకింగ్ స్టైల్ ఇప్పుడు రజనీకాంత్ సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   4 July 2026 1:00 PM IST
రజనీ ధర్మన్‌పై దురంధర్ ప్రభావం.. ఫ్యాన్స్ బిగ్ డిమాండ్!
X

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం `ధర్మన్‌` ఇటీవ‌లే గ్రాండ్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఓవైపు జైల‌ర్ 2తో అంచ‌నాలు పెంచేసిన ర‌జ‌నీ త‌దుప‌రి ధ‌ర్మ‌న్ అనే డాక్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తూ అభిమానుల్లో ఉత్సాహం పెంచారు. ఇటీవ‌లే విడుద‌లైన టైటిల్, ఫ‌స్ట్ లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అయితే ఈ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌క‌ముందే ర‌జ‌నీ అభిమానుల నుంచి ఒక విచిత్ర‌మైన డిమాండ్ మొదలైంది.

ఇటీవల బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దురంధర్, దురంధర్ 2 చిత్రాల అద్భుత విజయం..ఈ సినిమాల‌ మేకింగ్ స్టైల్ ఇప్పుడు రజనీకాంత్ సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆ చిత్రాలలో చూపించిన విజువల్ ట్రీట్, హీరో క్యారెక్టరైజేషన్, వేగవంతమైన స్క్రీన్‌ప్లే ఫార్మాట్ ప్రేక్షకులను- సినీ విమర్శకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో త‌లైవా న‌టిస్తున్న `ధ‌ర్మ‌న్` సినిమా కూడా అదే రేంజ్‌లో లేదా అంతకుమించి ఉండాలంటూ సోషల్ మీడియా వేదికల్లో అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

నిజానికి దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్ట్‌ను రజనీకాంత్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `నరసింహ`, క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `రాఘవన్`ల మిశ్ర‌మంగా అలాంటి మాస్ ఎలిమెంట్స్ - పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే తో తెరకెక్కించాలని భావించారు. అయితే నెటిజన్లు, అభిమానులు ఆదిత్యాధ‌ర్ `దురంధర్` రేంజ్ విజువల్స్ - మేకింగ్ స్టైల్‌ను ఆశిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో అశ్వత్‌లో తీవ్ర అంతర్మథనం, టెన్షన్ మొదలైనట్లు క‌నిపిస్తోంది. ప్రేక్షకుల అంచనాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకున్న ఈ యంగ్ డైరెక్టర్‌కు.. ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద సవాల్‌గా మారిందని గుస‌గుస వినిపిస్తోంది.

దర్శకుడు అశ్వత్ మారిముత్తు తన ఇటీవలి ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. నా కెరీర్‌లో నాకు లభించిన అత్యంత భారీ బాధ్యత ధర్మన్. ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించిన ప్రతిసారీ నాలో ఒక రకమైన భయం, టెన్షన్ మొదలవుతాయి. అందుకే నేను ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురికాకుండా.. కేవలం నా పనిని ఆస్వాధిస్తూ ముందుకు సాగుతున్నానని రజనీ సార్‌తోనే నేరుగా చెప్పాను. ఆయనతో కలిసి పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ధర్మన్స క‌చ్ఛితంగా ఒక అద్భుతమైన చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో రజనీ సార్ సిగ్నేచర్ స్వాగ్ తో పాటు నా మేకింగ్ స్టైల్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది! అని క్లారిటీ ఇచ్చారు.

టాలీవుడ్ సీనియర్ హీరోలపైనా `దురంధర్` ఇంపాక్ట్:

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో `దురంధర్` చిత్రాల ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి సోషల్ మీడియా ట్రెండ్సే నిదర్శనం. కేవలం పాన్ ఇండియా స్టార్ల చిత్రాలకే కాకుండా.. మన తెలుగు అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున వంటి స్టార్స్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయంలోనూ అభిమానులు ఇదే తరహా మేకింగ్ ఫార్మాట్‌ను కోరుకుంటున్నారు. తమ అభిమాన హీరోల సినిమాలు కూడా `దురంధర్` స్థాయి స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్ నేరేషన్..అద్భుత‌మైన‌ విజువల్స్ తో తెర‌కెక్కాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం చూస్తుంటే ఈ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

ఈ ఫార్మాట్ అందరికీ సాధ్యమేనా?

అయితే `దురంధర్` సిరీస్‌లో వర్కవుట్ అయిన హీరో పాత్ర చిత్రణ, వైవిధ్యమైన స్క్రీన్‌ప్లే ఫార్మాట్ అన్ని రకాల కమర్షియల్ సినిమాలకు సాధ్యపడుతుందా? అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతి కథకు ఒక ప్రత్యేకమైన ఆత్మ, భిన్నమైన ప్రయాణం ఉంటాయి. కేవలం ఒక ట్రెండ్‌ను బ్లైండ్‌గా ఫాలో అవ్వడం కంటే.. సదరు హీరో ఇమేజ్‌కు.. కథకు సింక్ అయ్యేలా స్క్రీన్‌ప్లే రాసుకోవడమే సినిమా విజయానికి ప్రధాన కారణం అవుతుంది. `ధర్మన్` విషయంలో దర్శకుడు అశ్వత్ ఈ అంచనాలను తట్టుకుని.. రజనీకాంత్ స్వాగ్‌ను ఏ విధంగా ప్రెజెంట్ చేస్తారో చూడాలి.