రజినీ 'ధర్మన్'.. హీరోయిన్ల లెక్కేంటి?
ఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు. వెనక నుంచి వెలుతురు పడుతుండటంతో ముఖాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు.
By: M Prashanth | 26 Oct 2026 9:15 AM ISTఇద్దరు ఎదురెదురుగా నిలబడ్డారు. వెనక నుంచి వెలుతురు పడుతుండటంతో ముఖాలు కూడా సరిగ్గా కనిపించడం లేదు. కానీ ఆ ఫొటోతోనే 'ధర్మన్' టీమ్ ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చింది. రజినీకాంత్ కొత్త సినిమాలో ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఉండగా, లేటెస్ట్ గా మరో స్టార్‌ను తీసుకొచ్చారు. ఇంతమంది నటీమణులు ఉన్నప్పుడు అసలు కథలో ఎవరికి ఎంత ప్రాధాన్యం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈసారి రజినీతో జతకట్టబోతున్నది నయనతార. 'చంద్రముఖి' నుంచి 'కుచేలుడు', 'దర్బార్', 'అన్నాత్తే' వరకు ఇద్దరూ కలిసి నటించారు. 'శివాజీ'లోని ఓ పాటలో కూడా నయన్ కనిపించారు. చివరిసారి 'అన్నాత్తే'లో కలిసి నటించిన ఈ జంట ఐదేళ్ల తర్వాత మళ్లీ ఒకే సినిమాలో కనిపించనుంది. అయితే ఈసారి నయనతారను ఎలాంటి పాత్ర కోసం ఎంచుకున్నారనేది మేకర్స్ ఇంకా బయటపెట్టలేదు.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే 'ధర్మన్'లో ఇప్పటికే సిమ్రాన్, రాశీ ఖన్నా, శ్రీలీల ఉన్నారు. ఇప్పుడు నయనతార కూడా చేరడంతో కాస్టింగ్ మరింత పెద్దదైంది. వీరిలో ఎవరు రజినీకి జోడీగా నటిస్తున్నారు, మిగతా పాత్రలకు కథలో ఎంత స్కోప్ ఉందనేది అసలు మ్యాటర్. ముఖ్యంగా నయనతార లాంటి స్టార్‌ను తీసుకున్నప్పుడు ఆమె క్యారెక్టర్‌కు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందనే అంచనాలు సహజంగానే ఉంటాయి.
మరోవైపు దర్శకుడు అశ్వత్ మారిముత్తుకు ఇదో పెద్ద అవకాశం. 'ఓ మై కడవులే', 'డ్రాగన్' సినిమాలతో యూత్‌ను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు తొలిసారి రజినీకాంత్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. గత సినిమాల్లో కామెడీతో పాటు రిలేషన్‌షిప్స్, పాత్రల మధ్య సంఘర్షణను బాగా చూపించారు. కానీ రజినీ సినిమా అనగానే అభిమానులకు మాస్ ఎలివేషన్స్ కూడా కావాలి. పైగా ఇంతమంది హీరోయిన్లను కథలో సరిగ్గా ఉపయోగించుకోవడం కూడా దర్శకుడికి పెద్ద పనే.
ఇక ఈ సినిమాను కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మహేంద్రన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. అయితే కమల్ ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. రజినీ వైద్యుడి పాత్రలో కనిపిస్తారనే వార్తలున్నా కథను మాత్రం రహస్యంగానే ఉంచుతున్నారు. లేటెస్ట్ పోస్టర్‌లో నయనతార, రజినీ ఎదురెదురుగా నిలబడటం చూస్తే ఇద్దరి పాత్రల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందనే ఆసక్తి పెరుగుతోంది.
ఇప్పటికే మూడు షూటింగ్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అక్టోబర్ విరామం తర్వాత నవంబర్‌లో మిగిలిన చిత్రీకరణ కొనసాగించనున్నారు. నయనతార కూడా షూటింగ్‌లో చేరినట్లు సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. యోగిబాబు కూడా సినిమాలో ఉన్నారు. మరోవైపు 2027 సంక్రాంతి రిలీజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నా, అధికారిక తేదీ ఇంకా ప్రకటించలేదు.
