అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం గ్రీస్‌లో నవంబర్ 11న జరిగింది. ఈ వేడుకకు హాజరైన రజినీకాంత్.. ‘వెట్టైయాన్’ సినిమాలోని ‘మనసెలాయో’ పాటకు నూతన దంపతులతో కలిసి హుక్ స్టెప్స్ వేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ జరగనుంది.
By: Sivaji Kontham | 12 Nov 2026 7:46 AM ISTసంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్- సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్ వివాహ వేడుక గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వేడుక నవంబర్ 10న సాంప్రదాయ నిశ్చితార్థంతో మొదలవగా.. నవంబర్ 11న వివాహ వేడుక వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు సూపర్‌స్టార్ రజినీకాంత్ తన సతీమణి లతాతో కలిసి హాజరయ్యారు. సతీమణి మేనల్లుడి వివాహం కావడంతో రజినీకాంత్ ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా గడిపారు. కుటుంబ వేడుకలో ఆయన సందడి చేయడం అక్కడ ఉన్నవారందరిలోనూ ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.
ఈ వేడుకల్లో భాగంగా అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన `వెట్టైయాన్` చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ `మనసెలాయో` పాటకు రజినీకాంత్ వేసిన హుక్ స్టెప్స్ హైలైట్‌గా నిలిచాయి. నూతన దంపతులతో కలిసి ఆయన ఈ పాటకు చిందులు వేయగా.. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వయసులోను ఏజ్ లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా! (నరసింహా సినిమాలో ని పాటను) అంటూ నెటిజనులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులే కాకుండా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తదితరులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. రాజకీయ, సినీ ప్రముఖుల రాకతో ఈ వేడుక మరింత ఘనంగా మారింది.
ఇక ఈ పెళ్లి వేడుకల్లో నూతన దంపతులు అనిరుధ్- కావ్య మారన్ ధరించిన డిజైనర్ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రీస్ వేదికగా అంగరంగ వైభవంగా ముగిసిన ఈ వేడుకల అనంతరం.. నవంబర్ 21న చెన్నైలో అత్యంత గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కి టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సినీపరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారని సమాచారం.
