Begin typing your search above and press return to search.

కూలీ ఓటీటీలోకి వ‌చ్చేద‌ప్పుడే!

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా కూలీ.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Sept 2025 6:21 PM IST
కూలీ ఓటీటీలోకి వ‌చ్చేద‌ప్పుడే!
X

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా కూలీ. ఈ సినిమాలో భారీ తారాగణం న‌టించింది. బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయగా, టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూలీలో విల‌న్ గా న‌టించారు. క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర, మ‌ల‌యాళ న‌టుడు సౌబిన్ షాహిర్ కూలీలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

రూ.1000 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని ఆశ‌లు

భారీ క్యాస్టింగ్ తో తెర‌కెక్కిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు భారీ అంచ‌నాలున్నాయి. కోలీవుడ్ నుంచి మొద‌ట రాబోయే రూ.1000 కోట్ల సినిమా ఇదేన‌ని కూలీ సినిమాపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు త‌మిళ ఆడియ‌న్స్. కానీ రిలీజ్ త‌ర్వాత వారి అంచ‌నాల‌న్నీ తారుమార‌య్యాయి. కూలీ సినిమాకు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు.

మిక్డ్స్ టాక్ తోనే రూ.500 కోట్లు

దీంతో ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వ‌చ్చింది. అయితే టాక్ ఎలా ఉన్నా కూలీ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ.500 కోట్లు వసూలు చేసింది. ఆగ‌స్ట్ 14న ప్రేక్ష‌కుల ఇండిపెండెన్స్ డే కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన కూలీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ గా నిల‌వ‌గా, ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 11 నుంచి ఓటీటీలోకి కూలీ

ఈ నేప‌థ్యంలోనే కూలీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ వ‌చ్చింది. సెప్టెంబ‌ర్ 11నుంచి ప్రైమ్ వీడియోలో కూలీ సినిమా రిలీజ్ కానున్న‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డిస్తూ ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూలీ సినిమా సెప్టెంబ‌ర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంద‌ని ప్రైమ్ వీడియో వెల్ల‌డించింది. శృతి హాస‌న్, స‌త్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన కూలీ సినిమాలో పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్ చేయ‌గా స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన విష‌యం తెలిసిందే.