కూలీ : శృతి నటన చూసి రజనీకాంత్ స్వీట్స్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ సినిమా విడుదలకు సిద్ధం అయింది.
By: Ramesh Palla | 6 Aug 2025 3:44 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఆగస్టు 14న భారీ ఎత్తున విడుదల కాబోతున్న కూలీ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఉన్నాయి. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మరో సీనియర్ సూపర్ స్టార్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కూలీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనవంతు ప్రయత్నం చేశారు. తన గత చిత్రాలన్నింటితో పోల్చితే ఈ సినిమా ది బెస్ట్‌గా ఉంటుంది అన్నట్లుగా ఆయన పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం కావడం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు.
కూలీ సినిమాలో శృతి హాసన్
సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దేశం మొత్తం తిరిగి మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తెలుగు మీడియాతోనూ ఆ మధ్య లోకేష్ కనగరాజ్ ఇంట్రాక్ట్ అయిన విషయం తెల్సిందే. తాజాగా లోకేష్ కనగరాజ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ.. కూలీ సినిమా షూటింగ్ జరిగినప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. సెట్స్ లో శృతి హాసన్ యొక్క నటన మొదటి సారి చూసి రజనీకాంత్ సర్ ఆమెకు స్వీట్స్ తెప్పించారు. ఆమె నటనకు ఫిదా అయిన ఆయన స్వీట్స్ తినిపించారు అన్నట్లుగా లోకేష్ చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ సినిమాలో శృతి హాసన్ పాత్ర ఏంటి అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రజనీకాంత్ కు జోడీగా ఆమె నటిస్తుందా అంటే క్లారిటీ ఇవ్వడం లేదు. సినిమా విడుదల అయ్యే వరకు ఆ విషయమై సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు.
రజనీకాంత్ కూలీ లో నాగార్జున
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో భారీ చిత్రంగా ఈ సినిమా ప్రచారం జరుగుతోంది. కూలీ సినిమాలో రజనీకాంత్ మాత్రమే కాకుండా భారీ స్టార్ కాస్ట్ ఉంది. అందరికీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యం అయిందా అనేది కొందరి అనుమానం. మొన్నటి వరకు సినిమాలో నాగార్జున హీరో స్థాయి పాత్ర అని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల ఒక మీడియా సమావేశంలో రజనీకాంత్ హీరో కాగా, నాగార్జున ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అన్నట్లుగా వ్యాఖ్యలు వినిపించాయి. అదే నిజం అయితే నాగార్జున విలన్‌గా ఎలా ఉంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీ సినిమాలో నాగార్జున చేసిన పాత్ర ఏది అయినా ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యత ఉండటం ఖాయం.
కూలీకి పోటీగా వార్ 2
కూలీ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ వీడియోలకు మంచి స్పందన దక్కింది. ప్రతి వీడియో సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున కూలీ సినిమాను విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూలీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలో వార్ 2 సినిమా నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుంది. వార్ 2 తో పోల్చితే కూలీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ థియేటర్లు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రెండు డబ్బింగ్ సినిమాలు కనుక సమానమైన థియేటర్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. కూలీ సినిమాతో రజనీకాంత్ మరోసారి తన స్టామినాను చాటి చెప్పే విధంగా ఉంటుందని లోకేష్ ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు.
