చెన్నై (X) హైదరాబాద్: 'కూలీ' టికెట్ రేట్లపై నెటిజనుల ఫైర్
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన `కూలీ` ఈనెల 14న అత్యంత భారీగా థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే
By: Sivaji Kontham | 12 Aug 2025 9:34 AM ISTరజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన `కూలీ` ఈనెల 14న అత్యంత భారీగా థియేటర్లలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 2025 మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్రచారం సాగిన ఈ సినిమా రజనీకాంత్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టే 350కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే నాన్ థియేట్రికల్ రైట్స్, ప్రీటికెట్ సేల్ ను కలుపుకుని 250కోట్ల మొత్తాన్ని వెనక్కి తెచ్చింది. ఇక థియేట్రికల్ గాను భారీ క్రేజ్ నెలకొనడంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. 74 వయసులోను రజనీ మానియా బాక్సాఫీస్ వద్ద ఎంతమాత్రం తగ్గలేదని ఇది నిరూపిస్తోంది. ఇక లోకేష్ కనగరాజ్ బ్రాండ్ కూడా వెలిగిపోతుండడంతో కూలీకి భారీ బజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఓ కీలక పాత్రలో నటించడంతో తెలుగు రాష్ట్రాల్లోను భారీ హైప్ నెలకొంది.
అయితే ఈ సినిమా తెల్లవారు ఝాము బెనిఫిట్ షోల కోసం భారీగా టికెట్ ధరలు పెంచి అమ్మడాన్ని కొందరు సోషల్ మీడియాల్లో వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో పకడ్భందీగా ప్రభుత్వం టికెట్ ధరల్ని నియంత్రిస్తుండడంతో రూ.55 మొదలు రూ.200 లోపు టికెట్ ని కొనుక్కుని జనం థియేటర్లకు వెళుతుంటే, ఇటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 400-500 వరకూ ఒక టికెట్ కి ఖర్చు చేయాల్సి వస్తోందన్న ఆందోళన నెలకొంది. ముంబై, దిల్లీ, కలకత్తా, బెంగళూరు, కొచ్చి, చంఢీగఢ్ వంటి చోట్ల టికెట్ ధరలు అమాంతం పెంచారని కూడా టాక్ వినిపిస్తోంది. రీక్లెయినర్ సీట్ల ధరల్ని వదిలేస్తే, సాధారణ సింగిల్ స్క్రీన్లకు 200, మల్టీప్లెక్స్ టికెట్ కు 400-500 వరకూ వెచ్చించాల్సి వస్తోందన్న కథనాలొస్తున్నాయి. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బుకింగులు ఓపెనైన నిమిషాల్లోనే వేలాదిగా టికెట్లు బుక్ అయ్యాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోల టికెట్ ధరలు చుక్కల్ని తాకాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ ఎక్స్ ఖాతాదారు తమిళనాడులో టికెట్ ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని టికెట్ ధరను పోలుస్తూ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. చెన్నై పీవీఆర్ లో రూ.183 ధర ఉంటే, హైదరాబాద్ పీవీఆర్ లో 453 ధర ఉందని.. తమిళంలో కంటే తెలుగు రాష్ట్రాల్లో ధర అధికంగా ఉండటం ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించాడు. ఎంత హైప్ ఉన్నా, ఎంత తోపు సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సిందే కదా? అని ప్రశ్నించాడు. ఇలా రేట్లు పెంచుతూ పోతే ఏదో ఒక రోజు బాయ్ కాట్ ట్రెండ్ మొదలు అవుతుంది.. అప్పుడు తెలుగు ఆడియెన్ విలువ ఏంటో తెలిసొస్తుందని ఘాటుగా రాసాడు.
ఉత్తరాదిన తెల్లవారుజాము, ఉదయం షోలకు సగటున ఒక్కో టికెట్‌కు రూ. 300 నుండి రూ. 500 వరకు ఉన్నాయని కూడా కథనాలొచ్చాయి. ఇక బెంగళూరులో తెల్లవారు ఝాము షోలకు 1000 వరకూ టికెట్ ధరను నిర్ధేశించారని కూడా గుసగుస వినిపిస్తోంది. అయితే కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఎలాంటి సినిమాకి అయినా రూ.200 లోపు మాత్రమే టికెట్ ధర ఉండాలని గత జూలైలో అధికారికంగా నిర్ధేశించింది. కానీ దానికి విరుద్ధమైన పరిస్థితులు ఆరంభ షోల విషయంలో ఉందని విమర్శలొస్తున్నాయి.
