సూపర్ స్టార్ అన్నయ్య కూడా వీరమరణమే!
సూపర్ స్టార్ రజనీకాంత్ వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ దేశభక్తిని చాటుకోవడంలో ముందుంటారు.
By: Srikanth Kontham | 25 March 2026 1:44 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ దేశభక్తిని చాటుకోవడంలో ముందుంటారు. ఇటీవల రిలీజ్ అయిన ధురందర్ 2 చిత్రాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసించడమే కాదు. ఆ సినిమాను బాక్సాఫీస్ కా బాప్ అని కొనియాడారు. అయితే రజనీకాంత్ ఈ చిత్రాన్ని ఇంతగా మెచ్చుకోవడానికి వెనుక ఒక బలమైన వ్యక్తిగత కారణం, ఓ విషాదకరమైన కుటుంబ నేపథ్యం ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రజనీకాంత్ సొంత అన్నయ్య నాగేశ్వరరావు దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుడు అనే విషయం చాలా మందికి తెలియదు.
1965లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో నాగేశ్వరరావు చురుగ్గా పాల్గొన్నారు. యుద్ధ క్షేత్రంలో శత్రువులతో పోరాడుతున్న సమయంలో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన వీరమరణం పొందారు. తన సొంత అన్నయ్య దేశం కోసం ప్రాణాలు అర్పించడం రజనీకాంత్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీరని లోటుగా మిగిలిపోయింది. యుద్ధం వల్ల కలిగే బాధ, సైనికుల కుటుంబాలు పడే వేదన రజనీకాంత్ కు ప్రత్యక్షంగా తెలుసు. అందుకే దేశభక్తి నేపథ్యంలో వచ్చే సినిమాలన్నా సైనికుల సాహస గాథలన్నా ఆయనకు ఎంతో గౌరవం.
ధురందర్ 2 సినిమాలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపే రహస్య ఆపరేషన్ ,మన సైనికుల తెగువను చూసినప్పుడు రజనీకాంత్ తన అన్నయ్య త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యానన్నారు. గతంలో ఓ సందర్భంలో రజనీకాంత్ ఏమన్నారంటే? యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే పోరాటం కాదు. అది ఎన్నో కుటుంబాల ఆశలను చిదిమేస్తుంది. మా అన్నయ్యను కోల్పోయినప్పుడు మా కుటుంబం ఎంత బాధపడిందో నాకు తెలుసు అని ఆవేదన చెందారు. అందుకే భారత సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా చూడాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశభక్తిని రగిలించే విధంగా ఉండటంతో అది రజనీకాంత్ హృదయాన్ని హత్తుకుంది.
సాధారణంగా రజనీకాంత్ ఇతర హీరోల సినిమాల గురించి పెద్దగా స్పందించరు. ఆ హీరోల సినిమాలు కూడా చూడరు. చాలా సెలక్టివ్ గానే సినిమాలు చూస్తుంటారు. పెద్ద హిట్ అయిన చిత్రాన్ని మాత్రం ప్రశంసించడం అలవాటు. అలా ధురంధర్ రజనీకాంత్ దృష్టిలో పడింది. కేవలం ఒక నటుడిగా కాకుండా ఒక వీర సైనికుడి తమ్ముడిగా స్పందించారు. `ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రం ఇది అని ఆయన చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం.. దేశం కోసం ప్రాణాలర్పించే ప్రతి సైనికుడికి మనం ఇచ్చే కనీస గౌరవం ఇదే అని చెప్పడమే. నాగేశ్వరరావు త్యాగం ఈ సినిమా ద్వారా మళ్ళీ చర్చనీయాంశమైంది. అభిమానులు సూపర్ స్టార్ కుటుంబం పట్ల మరింత గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాగేశ్వరరావు వంటి వీరుల త్యాగఫలమే నేటి మన శాంతి. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక కుటుంబాల్లో ధురంధర్ 2 ఓ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
