Begin typing your search above and press return to search.

బాలయ్య ఏం చేసినా.. ప్లాన్ మిస్ అవ్వదు!

స్టార్ హీరోల సినిమాల్లో కనిపించే అవకాశం వచ్చినప్పుడు చాలామంది వెంటనే ఓకే చెప్పేస్తారు.

By:  M Prashanth   |   24 Oct 2026 12:00 AM IST
బాలయ్య ఏం చేసినా.. ప్లాన్ మిస్ అవ్వదు!
X

స్టార్ హీరోల సినిమాల్లో కనిపించే అవకాశం వచ్చినప్పుడు చాలామంది వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ సీనియర్ హీరో నటసింహం బాలయ్య లెక్క మాత్రమే వేరని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. తన ఇమేజ్‌ కు ఎంత యూజ్ ఉంటుంది, ఎలాంటి ఎఫెక్ట్ చూపించగలదనే విషయాలను ఆయన లెక్కలోకి తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పుడు జైలర్ సిరీస్‌ విషయంలో బాలకృష్ణ పేరు మళ్లీ వినిపిస్తుండటంతో ఆయన స్ట్రాటజీపై చర్చ మొదలైంది.

వాస్తవానికి.. బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ పైకి వస్తే అభిమానులు కోరుకునే హంగామా వేరుగా ఉంటుంది. డైలాగులు, ఫైట్లు, ఎంట్రీ.. ఇలా ప్రతి విషయంలో కూడా బాలయ్య మార్క్ కనిపించాలని ఆశిస్తారు. అందుకే ఆయన ఏ సినిమాలో కనిపించినా, ఆ రోల్ కు తగిన ఇంపార్టెన్స్ ఉండటం ముఖ్యం.

అదే ఇప్పుడు జైలర్ సిరీస్ విషయంలో ఆసక్తిని పెంచుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన జైలర్ 2 మూవీలో కూడా క్యామియో రోల్స్ సందడి కనిపించింది. అయితే ఆ మూవీలోని ఓ కీలక పాత్ర కోసం నెల్సన్ బాలయ్యను సంప్రదించారనే కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

కానీ ఆ రోల్ రన్ టైమ్ చాలా తక్కువగా ఉండటంతో బాలయ్య ఓకే చెప్పలేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు ‘జైలర్-3’లో ఆయన కోసం మరింత స్ట్రాంగ్ రోల్ రెడీ అయిందని, ఇప్పటికే బాలయ్య ఓకే కూడా చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఆ ప్రచారంలో నిజం ఉంటే, బాలయ్య పాత్రల ఎంపిక విషయంలో ఎలాంటి లెక్కలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో కనిపించడం ఒక ప్రత్యేకతే.

కానీ తన రేంజ్ కు తగ్గ పాత్ర దక్కితే ఆ ఛాన్స్ కు మరింత వాల్యూ ఉంటుంది. కథలో ఇంపార్టెన్స్ ఉండటంతో పాటు, మాస్ ఇమేజ్‌ను చూపించే అవకాశం కూడా రావాలి. అప్పుడే ఆ పాత్ర అభిమానులకు గుర్తుండిపోతుంది. అంతేకాదు, రజనీతో కలిసి స్క్రీన్ పై కనిపిస్తే ఇద్దరి అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడతాయి. అయితే బాలయ్య కావాలనే రెండో పార్టు వదిలి మూడో పార్ట్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పడానికి ప్రూఫ్స్ లేవు.

అలా స్టార్ హీరోలకు అవకాశాలు రావడం ఒక ఎత్తయితే, తమ ఇమేజ్‌ కు సరిపోయే పాత్రను ఎంచుకోవడం మరో ఎత్తు. బాలయ్య విషయంలో కూడా ఆ లెక్కే క్రేజ్ పెంచుతోంది. చిన్న రోల్ లో కనిపించి వెళ్లిపోవడం కంటే, తన రేంజ్ చూపించే రోల్ దక్కితేనే కాంబోకి వాల్యూ విలువ ఉంటుంది. అందుకే బాలయ్య ఏం చేసినా దాని వెనుక ఓ ప్లాన్ ఉంటుందనే చర్చ అభిమానుల్లో ఇప్పుడు నడుస్తోంది.