ఫెయిల్యూర్ సినిమా డేట్ పై కన్నేసిన రజినీకాంత్.. తెలిసీ తప్పు చేస్తున్నారా?
అయితే ఇక్కడ ఒక స్టార్ హీరో మాత్రం ఫెయిల్యూర్ ను అందించిన సినిమా విడుదల తేదీపై కన్నేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By: Madhu Reddy | 14 Feb 2026 11:07 AM ISTసాధారణంగా చిన్న సినిమాలు తెరపైకి వస్తున్నాయి అంటే రిలీజ్ డేట్ విషయంలో అటు.. ఇటు.. ఎటువంటి సినిమాలు లేకపోవడం, హాలిడేస్ ఉండడం లాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మరీ సినిమాను రిలీజ్ చేస్తూ ఉంటారు అంతేకాదు విడుదలవుతున్న సినిమా డేట్ ముహూర్తం చూసుకొని మరీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాలే సినిమా విడుదల సమయంలో ఇన్ని జాగ్రత్తలు పాటిస్తుంటే.. ఇక పెద్ద హీరోలు..పైగా భారీ బడ్జెట్ చిత్రాలు ఏ రేంజ్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గతంలో తమ సినిమాలు ఏవైనా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాయి అంటే దాదాపు అదే రోజున మళ్లీ తమ ఇంకో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
ఉదాహరణకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం పెద్ది సినిమాతో ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో ఆయన నటించిన మగధీర సినిమా 2009 జూలై 30వ తేదీన రిలీజ్ అయింది. ఇక రంగస్థలం సినిమా 2018 మార్చి 30వ తేదీన విడుదలయ్యింది. ఇప్పుడు మళ్లీ పెద్ది సినిమా కూడా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ రెండు చిత్రాలు 30న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాయి .ఇప్పుడు భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కూడా ఏప్రిల్ 30న విడుదల అయితే మళ్లీ అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అనే ఆలోచనలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఇక్కడ ఒక స్టార్ హీరో మాత్రం ఫెయిల్యూర్ ను అందించిన సినిమా విడుదల తేదీపై కన్నేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ హీరోగా, సౌత్ సూపర్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు రజినీకాంత్. ఈయన 70 సంవత్సరాల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే 'జైలర్' సినిమా కంటే ముందు ఈయన సినిమాలు వరుసగా డిజాస్టర్ అవడంతో రజినీకాంత్ పని అయిపోయింది.. ఇక రిటైర్ అయ్యే సమయం వచ్చేసింది అని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. కానీ జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి నోళ్లు మూయించారు రజినీకాంత్.
తర్వాత లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ సినిమా చేశారు. ఇకపోతే జైలర్ సినిమా ఆగస్టు రెండవ వారం అనగా 2023 ఆగస్టు 10వ తేదీన విడుదలయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అదే తేదీలలో విడుదల చేస్తే కూలీ కూడా బ్లాక్ బాస్టర్ అందుకుంటుందని ఆగస్టు 14న ఏరికోరి మరీ సినిమాను రిలీజ్ చేశారు.కానీ సినిమా బొక్క బోర్ల పడింది. అయితే ఇప్పుడు మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి జైలర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రజినీకాంత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తోంది. అటు చెన్నై మీడియా వర్గాలు జూన్ విడుదల అని ఊదరగొడుతున్నా.. రజనీకాంత్ టీమ్ మాత్రం సెంటిమెంటుకే ఓటు వేయనుంది అని4 సమాచారం.
దీంతో అభిమానులలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ బృందం ఆలోచిస్తున్న డేట్ మేరకు ఆగస్టు 2వ వారంలో ఇండిపెండెన్స్ డే ని లక్ష్యంగా చేసుకొని ఆగస్టు 12 లేదా 14వ తేదీన రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు .ఆగస్టు 10వ తేదీన జైలర్ వచ్చి మంచి విజయం అందుకుంది. అందుకే ఆగస్టు 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కానీ అదే రోజున కూలీ వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. కాబట్టి అసలు ఈ డేట్ వర్కౌట్ అవుతుందా? ఎందుకు ఈ డేట్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు అనే కామెంట్ లు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
మరి కనీసం ఇప్పటికైనా రజినీ టీం ఆలోచించి విడుదల తేదీని వాయిదా వేసుకుంటే బెటర్ అని తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ క్యామియో పాత్ర తాలూకు షూట్ ఇంకా పూర్తి కాలేదు.. విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కు సంబంధించిన కొన్ని సీన్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయట. ఇక అవన్నీ పూర్తి చేసేలోపు వేసవి కూడా అయిపోతుంది. అందుకే కాస్త ఆలస్యమైనా సరే విడుదల తేదీ విషయంలో జాగ్రత్త పడాలని సలహా ఇస్తున్నారు అభిమానులు.
