టాప్ స్టోరి: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆ ముగ్గురు
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వంటి దిగ్గజాలు కేవలం వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలో కూడా తమ సింప్లిసిటీతో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
By: Sivaji Kontham | 1 Feb 2026 8:00 AM ISTఅమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వంటి దిగ్గజాలు కేవలం వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలో కూడా తమ సింప్లిసిటీతో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం వెనుక వారి ఆధ్యాత్మిక దృక్పథం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీ వెనుక రహస్యం పరిశీలిస్తే.., రజనీకాంత్ హిమాలయాల యాత్రలు, మహావతార్ బాబాజీ బోధనలు వినేందుకు ఇష్టపడతారు. ఆయనకు షూటింగ్ లేకపోతే కేవలం సాధారణ పంచె, లుంగీలోనే కనిపిస్తారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ నుంచి సాహిత్యం, క్రమశిక్షణ అవవరుచుకున్నారు. ఈ వయసులో కూడా ఆయన సెట్స్‌లో అందరికంటే ముందు ఉండి అందరినీ గౌరవిస్తారు. అంతేకాదు యువకుల కంటే ఎక్కువ ఉత్సాహంగా ఈ వయసులోను నటిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి హనుమంతుడి భక్తుడు. సామాన్య కుటుంబం నుండి గ్లామర్ ప్రపంచంలోకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగేందుకు ఎంతో శ్రమించారు. ఒదిగి ఉండే స్వభావం ఆయన ప్రత్యేకత. పై ముగ్గురూ కొత్త వారితో కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడే నైజం ఉన్నవారు. లగ్జరీ కంటే సాధారణ ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు.
అహంకారం వీడితేనే అసలైన సుఖం
నిజానికి ఏ మనిషి అయినా అహంకారం వీడితేనే సుఖం. ఎంత సింపుల్‌గా జీవిస్తే అంత మేలు! అనేది అక్షర సత్యం. ఈ స్టార్లందరూ తమలోని `అహాన్ని` పక్కన పెట్టారు కాబట్టే వేల కోట్ల ఆస్తి ఉన్నా సామాన్యుడిలా జీవించేందుకు వెనకాడరు. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు.. ఎదుటి మనిషిని గౌరవించడం తన మూలాలను మర్చిపోకపోవడం అని వీరు నిరూపిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అరవింద్ స్వామి చెప్పిన ఈ సంఘటన ఎంతో ఆశ్చర్యం కలిగించింది. తళపతి (1991) షూటింగ్ సమయంలో సెట్లో ఒక బెడ్ పై అరవింద్ స్వామి ఆదమరిచి నిద్ర పోయారు. అయితే అది రజనీకి కేటాయించిన బెడ్ అనే విషయం అతడికి తెలియదట. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన రజనీకాంత్ ఆ దృశ్యం చూసారు. అయితే అతడిని నిద్రలేపి డిస్ట్రబ్ చేయలేదు. ఎవరో కొత్త కుర్రాడు.. పాపం అలసిపోయి నిదురపోతున్నాడు.. అని తను చాప తీసుకుని నేలపైనే నిదురించారట. అయితే కాసేపటికి నిదుర లేచి చూశాక అరవింద స్వామి షాక్ అయ్యారట. ఈ విషయాన్ని ఇప్పుడు అతడు గుర్తుచేసుకున్నారు.
