రజనీ 50 ఏళ్ల ఎవర్ గ్రీన్ స్టైల్..!
తమిళ్ లో సినిమాలు తీసే రజనీకి భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఏర్పడ్డారు. తెలుగులో అయితే రజనీకాంత్ కి వీరాభిమానులు ఉన్నారు.
By: Ramesh Boddu | 15 Aug 2025 12:37 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ తొలి సినిమా అపూర్వ రాగంగళ్ రిలీజై నేటితో 50 ఏళ్లు అవుతుంది. 1975 ఆగష్టు 15న ఆ సినిమా రిలీజైంది. అప్పటి నుంచి 50 ఏళ్లుగా తన సినిమాలతో స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు రజనీకాంత్. రజనీకాంత్ అనగానే ఆయన స్టైల్ గుర్తుకొస్తుంది. అందరిలా చేస్తే తాను ఎలా స్పెషల్ అవుతా అని కెరీర్ తొలినాళ్లలోనే తన స్టైల్, స్వాగ్ డిఫరెంట్ అని నిరూపిస్తూ వచ్చాడు రజనీకాంత్. అది చూసి ఆడియన్స్ సూపర్ అనేయడంతో అదే స్టైల్ ని కొనసాగిస్తూ వచ్చారు.
బాలచందర్ దృష్టిలో పడి..
రజనీకాంత్ ఎవర్ గ్రీన్ స్టైల్ కి 50 ఏళ్ల పండగ నేడు. ఒక సాధారణ బస్ కండక్టర్ గా జీవనం సాగిస్తున్న అతన్ని స్నేహితులు ప్రోత్సహించి మద్రాస్ ఇప్పటి చెన్నై పంపించారు. సినిమా అవకాశాల కోసం కాస్త ఇబ్బంది పడ్డ రజనీ కె. బాలచందర్ దృష్టిలో పడ్డారు. రజనీ స్టైల్ ఆయనకు బాగా నచ్చింది. అది చూసే ఆయనతో సినిమా తీశారు.
తమిళ్ లో సినిమాలు తీసే రజనీకి భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఏర్పడ్డారు. తెలుగులో అయితే రజనీకాంత్ కి వీరాభిమానులు ఉన్నారు. ఆయన సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. తెలుగులో కూడా రజనీ సినిమాలు రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి.
జపాన్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్..
రజనీకాంత్ కు జపాన్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆయన సినిమాల రిలీజ్ లకు భారీ కటౌట్ లు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక రజనీ సినిమా సూపర్ హిట్ అయితే ఆ థియేటర్ బయట బజ్జీల బండి వ్యక్తి లక్షాదికారి అయ్యాడని చెబుతుంటారు. అంతగా ఆయన సినిమా వసూళ్లు వచ్చాయని చెప్పొచ్చు.
మంచి మనసుతో ప్రేక్షకుల హృదయాలను..
నటుడిగా తన స్టైల్ తో 50 ఏళ్లుగా మెప్పిస్తూ వచ్చిన రజనీ అంతకు మించి మంచి మనసుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారు. తన సింప్లిసిటీ.. తన నిజాయితీ రజనీని ఖ్యాతిని మరింత పెంచాయి. సూపర్ స్టార్ రేంజ్ ఆయనది అయినా కూడా చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటూ సాటి మనిషిని గౌరవించడంలో రజనీ ఎప్పుడు ముందుంటాడు. ఇవన్నీ కూడా రజనీని టాప్ లెవెల్ లో నిలబెట్టాయి.
ఇక రజనీ మాస్ స్టామినా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న వారిలో టాప్ 1 గా నిలిచాడు రజనీకాంత్. ఆయన 50 ఏళ్ల సినీ పండగలో లేటెస్ట్ గా రజనీ 171వ సినిమా కూలీ రిలీజైంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
