Begin typing your search above and press return to search.

శృతి క్లారిటీతో కొత్త సస్పెన్స్ స్టార్ట్!

సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టుల్లో డైరెక్ట‌ర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్న రజినీకాంత్- కమల్ హాసన్ మల్టీస్టారర్ ఒకటి.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 Jun 2026 12:31 PM IST
శృతి క్లారిటీతో కొత్త సస్పెన్స్ స్టార్ట్!
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టుల్లో డైరెక్ట‌ర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్న రజినీకాంత్- కమల్ హాసన్ మల్టీస్టారర్ ఒకటి. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఎక్కువగా వినిపించిన పేరు శృతి హాసన్‌ది. కమల్ హాసన్ కూతురు కావడంతో పాటూ, రజినీకాంత్ హీరోగా వ‌చ్చిన కూలీ సినిమాలో ఆమె ఇప్పటికే న‌టించ‌డం వల్ల ఈ కొత్త మల్టీస్టారర్‌లో కూడా ఆమె నటించే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా రజినీ- కమల్ వంటి ఇద్దరు దిగ్గజాలు కలిసి నటిస్తున్న సినిమాలో శృతి హాసన్ ఉంటే ఆ వార్తకు మరింత ప్రత్యేకత వస్తుందని అభిమానులు భావించారు.

అయితే ఈ ఊహాగానాలకు తాజాగా శృతి హాసన్ స్వయంగా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో తాను భాగం కాలేదని ఆమె స్పష్టం చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొంతకాలంగా కొనసాగుతున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. కానీ శృతి పేరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదే హీరోయిన్ కాస్టింగ్. ఇద్దరు లెజెండరీ స్టార్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారు? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

కథలో హీరోయిన్ పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది? సీనియర్ స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేక పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎంపిక వైపు వెళ్తారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక డైరెక్ట‌ర్ నెల్సన్ దిలీప్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. జైలర్ తర్వాత తన ప్రాజెక్టుల విషయంలో నెల్సన్ ఎక్కువ సీక్రసీ మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నటీనటుల ఎంపిక నుంచి కథకు సంబంధించిన కీలక అంశాల వరకు అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ మల్టీస్టారర్ విషయంలో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే శృతి హాసన్ పేరు చుట్టూ వచ్చిన ప్రచారం, ఆ తర్వాత వచ్చిన క్లారిటీ ఇప్పుడు అభిమానుల దృష్టిని హీరోయిన్ ఎంపిక పైకి మళ్లించింది. మరోవైపు నెల్సన్ టీమ్ మాత్రం కాస్టింగ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించకపోవడంతో సస్పెన్స్ మరింత పెరిగింది. సినిమా షూటింగ్ మొద‌ల‌వ‌డానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ భారీ చర్చకు దారితీస్తోంది. ఇక హీరోయిన్ ఎవరు? నెల్సన్ తన మాస్టర్ ప్లాన్‌లో ఎవరిని దాచిపెట్టార‌నే ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఈ మిస్టరీ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.