Begin typing your search above and press return to search.

15 ఏళ్ల అభిమానిని పెళ్లాడిన స్టార్ హీరో .. ఆపై తీరని వేదన!

భారతీయ చిత్ర పరిశ్రమలో `మొదటి సూపర్ స్టార్`గా వెలుగొందిన రాజేష్ ఖన్నా జీవితం వెండితెరపై ఎంత కలర్‌ఫుల్‌గా ఉండేదో నిజజీవితంలో అంతకంటే ఎక్కువ నాటకీయ పరిణామాలతో సాగింది.

By:  Sivaji Kontham   |   12 May 2026 4:00 AM IST
15 ఏళ్ల అభిమానిని పెళ్లాడిన స్టార్ హీరో .. ఆపై తీరని వేదన!
X

భారతీయ చిత్ర పరిశ్రమలో `మొదటి సూపర్ స్టార్`గా వెలుగొందిన రాజేష్ ఖన్నా జీవితం వెండితెరపై ఎంత కలర్‌ఫుల్‌గా ఉండేదో నిజజీవితంలో అంతకంటే ఎక్కువ నాటకీయ పరిణామాలతో సాగింది. ముఖ్యంగా ఆయన వివాహం , ప్రేమ వ్యవహారాలు నిరంతరం మీడియా హెడ్ లైన్స్‌లో నిలిచేవి. 1973లో రాజేష్ ఖన్నా తనకంటే వయసులో సగం చిన్నదైన కేవలం 15 ఏళ్ల టీనేజ్ అమ్మాయి డింపుల్ కపాడియాను వివాహం చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అప్పటికే `బాబీ` సినిమాతో స్టార్‌డమ్ తెచ్చుకున్న డింపుల్ తన అభిమాన నటుడినే పెళ్లాడటం ఒక కలలా భావించినా ఆ కల ఎంతో కాలం నిలవలేదు.





పెళ్లి తర్వాత డింపుల్ కపాడియాను సినిమాలకు స్వస్తి చెప్పమని రాజేష్ ఖన్నా కోరడంతో ఆమె నటనకు దూరమయ్యారు. అయితే వారి వైవాహిక జీవితంలో కొద్ది నెలలకే విభేదాలు పొడసూపాయి. రాజేష్ ఖన్నా కెరీర్ పతనం కావడం... మద్యానికి బానిసవ్వడం.. కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోవడం వారి బంధాన్ని దెబ్బతీశాయి. ``నేను రాజేష్ ఖన్నాను పెళ్లాడిన రోజే మా ఇంట్లో సంతోషం ఆవిరైపోయింది`` అని డింపుల్ ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించడం వారి మధ్య ఉన్న గ్యాప్‌ను స్పష్టం చేస్తుంది. వీరిద్దరికీ ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా అనే ఇద్దరు కుమార్తెలు జన్మించినా కలతలు మాత్రం తగ్గలేదు.

ఈ క్రమంలో రాజేష్ ఖన్నా జీవితంలోకి మరో నటి టీనా మునిమ్ ప్రవేశించింది. వీరిద్దరూ కలిసి దాదాపు 11 చిత్రాల్లో నటించగా వీరి ప్రేమ వ్యవహారం బహిరంగ రహస్యంగా మారింది. సౌతన్ సినిమా షూటింగ్ సమయంలో వీరి అఫైర్ గురించి తెలుసుకున్న డింపుల్ కపాడియా తన బ్యాగులు సర్దుకుని రాజేష్ ఖన్నా బంగ్లా `ఆశీర్వాద్` నుండి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత వారు విడివిడిగా ఉన్నా.. అధికారికంగా మాత్రం ఎప్పుడూ విడాకులు తీసుకోలేదు. రాజేష్ ఖన్నా విడాకులు కోరినా డింపుల్ మాత్రం అందుకు సమ్మతించకపోవడం గమనార్హం.

జీవితం చరమాంకంలో రాజేష్ ఖన్నా మరో మాజీ నటి అనితా అద్వానీతో సహజీవనం చేశారు. సుమారు పదేళ్ల పాటు ఆమె ఆయనతో కలిసి నివసించింది. రాజేష్ ఖన్నా చనిపోయే వరకు అనితా ఆయనతోనే ఉన్నా.. చట్టబద్ధంగా మాత్రం ఆయన డింపుల్ కపాడియా భర్తగానే కొనసాగారు. విచిత్రమేమిటంటే.. అనితా అద్వానీతో రాజేష్ ఖన్నా బంధం గురించి డింపుల్ ఎప్పుడూ బహిరంగంగా విమర్శించలేదు. పైగా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన తరపున ప్రచారం చేస్తూ ఒక స్నేహితురాలిగా అండగా నిలిచారు.

2012 జూలై 18న రాజేష్ ఖన్నా కన్నుమూసినప్పుడు డింపుల్ కపాడియా ఆయన పక్కనే ఉన్నారు. మొదటి సూపర్ స్టార్‌గా కోట్లాది మంది ఆరాధ్య దైవమైన రాజేష్ ఖన్నా జీవితం.. వ్యక్తిగత అఫైర్ల కార‌ణంగా ఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు, ఏకాంతంతో ముగిసింది. ఒక 15 ఏళ్ల అభిమానిని పెళ్లాడటం నుండి.. మరొకరితో సహజీవనం చేయడం వరకు ఆయన జీవితం ఒక వివాదాస్పద గ్రంథంలా నిలిచిపోయింది.