Begin typing your search above and press return to search.

ప‌నికి రాని న‌టుడు అని అవ‌మానించిన చోటే..!

భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి సూపర్ స్టార్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు రాజేష్ ఖన్నా.

By:  Sivaji Kontham   |   15 May 2026 8:30 AM IST
ప‌నికి రాని న‌టుడు అని అవ‌మానించిన చోటే..!
X

భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి సూపర్ స్టార్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు రాజేష్ ఖన్నా. 1960, 70వ దశకాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం భారతీయ సినిమా చరిత్రలోనే అపూర్వం. అభిమానులు ఆయన ఫోటోలను పెళ్లి చేసుకోవడం... ఆయన కారుకు ముద్దులు పెట్టడం... రక్తం తో ప్రేమ లేఖలు రాయడం వంటివి వింటే నేటి తరం ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇంతటి మహోన్నత స్థాయికి చేరుకోకముందు ఆయన ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలు అన్నీ ఇన్నీ కావు.

రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా. వెండితెరపై మెరవాలంటే ఆ పేరు కంటే `రాజేష్ ఖన్నా` అనే పేరు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని ఆయన బాబాయ్ సూచించడంతో పేరు మార్చుకున్నారు. అయితే కెరీర్ ప్రారంభంలో ఆయనను చాలా మంది తక్కువ చేసి చూశారు. అప్పట్లో ప్రముఖ నటుడు మెహమూద్ అయితే ఏకంగా రాజేష్ ఖన్నాను ఒక `ఫాల్తూ యాక్టర్` (పనికిరాని నటుడు) అని విమర్శించడమే కాకుండా అత‌డు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని ఎద్దేవా చేశారు. కానీ కాలక్రమేణా తన నటనతో అందరి నోళ్లు మూయించి భారతీయ సినిమా గతిని మార్చేశారు.

1969 నుండి 1971 మధ్య రాజేష్ ఖన్నా సృష్టించిన రికార్డు నేటికీ చెక్కుచెదరలేదు. కేవలం మూడేళ్ల వ్యవధిలో వరుసగా 15 సోలో హిట్ చిత్రాలను అందించి బాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆరాధన, ఆనంద్, కటి పతంగ్, అమర్ ప్రేమ్ వంటి చిత్రాలు అత‌డిని తిరుగులేని స్టార్‌గా నిలబెట్టాయి. ఆ సమయంలో ఆయన మేనరిజమ్స్, రొమాంటిక్ ఇమేజ్ దేశవ్యాప్తంగా ఒక మ్యానియాను సృష్టించాయి. విమర్శకులు పనికిరాడు అన్న చోటే ఆయన ఒక స్టార్ గా ఎదిగారు.

రాజేష్ ఖన్నా కెరీర్‌లో కొన్ని ఆసక్తికరమైన మలుపులు కూడా ఉన్నాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలో క్లాసిక్‌గా నిలిచిపోయిన `మిస్టర్ ఇండియా` సినిమా ఆఫర్ మొదట ఆయన వద్దకే వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించడంతో ఆ అవకాశం అనిల్ కపూర్ వరించింది. అలాగే అమితాబ్ బచ్చన్ ఎదుగుతున్న తరుణంలో వారిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. తన స్టార్‌డమ్ తగ్గుతున్న క్రమంలో బచ్చన్ తనను వెనక్కి నెడుతున్నారని ఖన్నా భావించేవారని యాసిర్ ఉస్మాన్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

నటుడిగానే కాకుండా రాజేష్ ఖన్నా రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1990వ దశకంలో న్యూఢిల్లీ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సినీ జీవితంతో పోలిస్తే రాజకీయాల్లో ఆయన విజయం తక్కువే అయినా ఒక ప్రజా నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కేవలం ఒక `ఫాల్తూ యాక్టర్` అని అవమానించిన చోటే కోట్లాది మంది ఆరాధ్య దైవంగా మారిన రాజేష్ ఖన్నా ప్రయాణం పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని నిరూపిస్తుంది.