చిన్న సినిమాలంటే చిన్నచూపా? 'K-ర్యాంప్' టీమ్ ఫైర్!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ 'K-ర్యాంప్' శనివారం దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చింది.
By: M Prashanth | 18 Oct 2025 11:00 PM ISTయంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ 'K-ర్యాంప్' శనివారం దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విడుదలైన మొదటి రోజు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో, చిత్రయూనిట్ శనివారం సాయంత్రం థాంక్స్ మీట్ నిర్వహించి, రివ్యూలపై తమ అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేశారు..
నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ, రివ్యూల విషయంలో కొందరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. "నా సినిమాకు ఎంత రేటింగ్ ఇచ్చినా నేను స్వాగతిస్తాను, కానీ పక్షపాతం చూపించడమే నన్ను బాధిస్తోంది. ఎక్స్‌లో కొందరు రివ్యూయర్లు కొన్ని సినిమాలకు ఫస్టాఫ్ రివ్యూ ఇచ్చి, మూడు గంటల తర్వాత సెకండాఫ్ రివ్యూ ఇస్తున్నారు. మరికొన్నింటికి ఫైనల్ రేటింగ్ ఎప్పటికో డిసైడ్ చేస్తున్నారు. ఇంత పక్షపాతం ఎందుకు? ఒక చిన్న నిర్మాత ఏం చేసినా భరిస్తాడని అనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు.
ఆయన తన ఆవేదనను కొనసాగిస్తూ, "ఇది కేవలం నా సమస్య కాదు, నాలాంటి ఎంతోమంది నిర్మాతల సమస్య. 'బాహుబలి' లాంటి పెద్ద సినిమా అయినా, 'కె- ర్యాంప్' లాంటి మూవీ అయినా కూడా మీరు ఒకేలా చూడాలి" అని కోరారు. ఏది ఏమైనా, తమ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, వారే దాన్ని సక్సెస్ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిర్మాత ఆవేదనకు హీరో కిరణ్ అబ్బవరం కూడా గొంతు కలిపారు. "సినిమా నిజంగా బాగోలేకపోతే మేం ఇలా సక్సెస్ మీట్ పెట్టం. ఇది ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని ముందే చెప్పాం, ప్రయోగాత్మక చిత్రం అని చెప్పలేదు. కనీసం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునైనా పాజిటివ్‌గా చెబుతారేమోనని ఆశించాం. అలా జరిగి ఉంటే మరింత ఆనందంగా ఉండేవాళ్లం" అని అన్నారు. గతంలో తన 'ఎస్.ఆర్. కల్యాణమండపం' సినిమాకి కూడా మొదట ఇలాంటి రివ్యూలే వచ్చినా, సాయంత్రానికి షోలు ఫుల్ అయ్యాయని ఆయన గుర్తుచేశారు.
దర్శకుడు జైన్స్ నాని కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలకు, సినిమాలో ఉన్న అసలు కంటెంట్‌కు పొంతన లేదని తన స్నేహితులు అన్నారని ఆయన తెలిపారు. ఇలా చిత్రయూనిట్ మొత్తం ఏకతాటిపై నిలిచి, రివ్యూల విషయంలో తమ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేసింది. ఈ ఆన్‌లైన్ చర్చ ఎలా ఉన్నప్పటికీ, సినిమాకు ఆదరణ లభిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా B, C సెంటర్లలో సినిమా సాయంత్రం షోల నుంచి పుంజుకుందని, మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోందని సమాచారం. ప్రేక్షకుల తీర్పే ఫైనల్ అని చిత్రయూనిట్ బలంగా నమ్ముతోంది.
