మాస్ జాతర.. ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానన్న రాజేంద్రుడు
తాను చాలామంది స్టార్లతో కలిసి పని చేస్తే భారీ హిట్లు వచ్చాయని, రవితేజతో అలాంటి ఒక హిట్ ఇవ్వలేదని బాధ తనలో అలానే ఉండిపోయిందని కూడా రాజేంద్రుడు అన్నారు.
By: Sivaji Kontham | 28 Oct 2025 10:44 PM ISTమాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన `మాస్ జాతర` త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన మాస్ జాతర ప్రీరిలీజ్ వేడుకలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో రవితేజ మాస్ జాతర చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకపోతే, తాను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. అన్ని రకాల మాస్ మసాలా అంశాల కలయికతో ఈ చిత్రం రూపొందిందని, రవితేజ భారీ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడని రాజేంద్రప్రసాద్ అన్నారు.
తాను చాలామంది స్టార్లతో కలిసి పని చేస్తే భారీ హిట్లు వచ్చాయని, రవితేజతో అలాంటి ఒక హిట్ ఇవ్వలేదని బాధ తనలో అలానే ఉండిపోయిందని కూడా రాజేంద్రుడు అన్నారు. మాస్ జాతర చిత్రంతో ఆ లోటు తీరుతుందని, ఈ సినిమా రవితేజ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు.
రవితేజ కొన్నిరకాల సీన్లను అడిగి మరీ సినిమాలో పెట్టించుకున్నాడు. ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకున్నాడు. విజయం సాధించడమే ధ్యేయంగా హార్డ్ వర్క్ చేసారని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. రవితేజ ఏ సినిమాలోను ఇన్ని రకాల షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించలేదని కూడా అతడు తెలిపారు. మరీ ఎక్కువ చెబితే బావుండదని కొన్నిటిని దాచేస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు భాను భోగారపు, శ్రీలీల, నిర్మాత నాగవంశీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాస్ జాతర ఈనెల 31న విడుదల కానుంది.
