మన రాజేంద్రుడు పద్మశ్రీ అయ్యారు
తెలుగు సినిమాకి నవ్వును హీరోగా చేసి దశాబ్దాల పాటు ఒప్పించి మెప్పించిన మేటి నటుడు రాజేంద్ర ప్రసాద్, ఆయన టాలెంట్ కి తెలుగు సినీ సీమ ఎంతో పొంగిపోయింది.
By: Satya P | 26 Jan 2026 9:33 AM ISTతెలుగు సినిమాకి నవ్వును హీరోగా చేసి దశాబ్దాల పాటు ఒప్పించి మెప్పించిన మేటి నటుడు రాజేంద్ర ప్రసాద్, ఆయన టాలెంట్ కి తెలుగు సినీ సీమ ఎంతో పొంగిపోయింది. అందుకే ఆయన కొత్తగా క్రియేట్ చేసిన కామెడీ జానర్ ని సైతం అక్కున చేర్చుకుని రాజేంద్రుడికి పట్టాభిషేకం చేసింది. రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటుడు. ఇందులో వేరేగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయనది ఏకంగా అర్ధ శతాబ్దం సినీ జీవితం. మద్రాస్ లోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో తొలి బ్యాచ్ లో విద్యార్ధిగా ఉంటూ గోల్డ్ మెడల్ సాధించారు.
నటుడిగా తొలి మూవీ :
ఇక రాజేంద్ర ప్రసాద్ కి నటుడుగా తొలి మూవీ స్నేహం సినిమా. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే వెంటవెంటనే అవకాశాలు ఆయనకు రాలేదు, దాంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా కెరీర్ స్టార్ట్ చేసి తనలోని రెండవ కోణాన్ని కూడా రాజేంద్రప్రసాద్ చాటుకున్నారు. అలా మెల్లగా నటుడిగా చిన్న పాత్రలలో నటిస్తూ 1985లో వంశీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమించు పెళ్ళాడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అది లగాయతు వెనక్కి చూసుకోలేదు. ఒక దశలో రాజేంద్ర ప్రసాద్ మూవీస్ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించి నిర్మాతలకు కనక వర్షం కురిపించాయి.
మంచి నటుడుగా :
రాజేంద్ర ప్రసాద్ కేవలం కామెడీ మాత్రమే కాదు సీరియస్ రోల్స్ కూడా చేసి శభాష్ అనిపించుకున్నారు. ఎర్ర మందారం మూవీ దానికి అచ్చమైన ఉదాహరణ. అంతే కాదు ఆయన నటించిన ఎన్నో సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ నలుగురు మూవీలో రాజేంద్ర ప్రసాద్ నటన హైలెట్ అని చెప్పాల్సిందే. ఇక కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, సంగీత దర్శకుడుగా కూడా రాజేంద్ర ప్రసాద్ తన సత్తా చాటారు.
హాలీవుడ్ మూవీలో సైతం :
కేవలం తెలుగు సినిమాలో మాత్రమే కదు క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్ లో కూడా రాజేంద్ర ప్రసాద్ నటించారు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా కు 2015 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా గెలిచి తన నాయకత్వాన్ని సైతం నిరూపించుకున్నారు.
ఎన్నో పురస్కారాలు :
రాజేంద్ర ప్రసాద్ నటనా ప్రస్థానం లో ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. ఎర్రమందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం - 1991లో అందుకున్నారు. అలాగే మేడమ్ సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు - 1994, ఆ నలుగురు సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు - 2004, సైమా అవార్డులు అందుకున్న ఆయన 2012లో ఉత్తమ సహాయ నటుడుగా జులాయి మూవీకి, 2015లో ఉత్తమ సహాయ నటుడుగా శ్రీమంతుడు మూవీకి, 2018లో ఉత్తమ సహాయ నటుడు మహానటి మూవీకి అవార్డుని పొందారు, ఎన్నో ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు ఆయనకు దక్కాయి.
పద్మశ్రీ తో :
ఈ కీలక సమయంలో పద్మశ్రీ అవార్డు రాజేంద్రుడిని వరించింది. ఆయన ప్రతిభను కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కారాలలో ఒకటి అయిన పద్మశ్రీని ఆయనకు అందించి గౌరవించింది. దాంతో రాజేంద్ర ప్రసాద్ కి తగిన సమయంలో తగిన గౌరవం దక్కింది అని అంతా అంటున్నారు. మన రాజేంద్రుడు పద్మశ్రీ గ్రహీత అయ్యారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
