బెస్ట్ ప్రెండ్ స్పూర్తితో సిక్స్ ప్యాక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్- నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Srikanth Kontham | 23 May 2026 10:00 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్- నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు మంచి స్నేహితులు. ఇండస్ట్రీలో బెస్ట్ స్నేహితులుగా పేరుంది. ఆ స్నేహం మధ్య చీలిక వచ్చిందని ఆ మధ్య నెట్టింట ప్రచారం జరిగినా? అదంతా అవాస్తవమని తేలిపోయింది. తమ మధ్య స్నేహం మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ పదిలంగానే ఉంటుందని రాజీవ్ వివరణతో క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ స్నేహ బంధం ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వార్తల్లో నిలిచింది. ప్రాణస్నేహితుడైన తారక్ చూపించిన అద్భుతమైన పట్టుదల, క్రమశిక్షణ రాజీవ్ కనకాలను సరికొత్త ఫిట్‌నెస్ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయి.
జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక చిత్రం `డ్రాగన్` కోసం శారీరకంగా ఎంతో కష్ట పడుతున్నారు. పాత్ర డిమాండ్ మేరకు ఏకంగా 15 కిలోల బరువు తగ్గి ఎంతో సన్నబడ్డారు. ఎంతో మొండిగా, కఠోరమైన డైట్ వర్కవుట్ నియమాలను పాటిస్తూ తారక్ సాధించిన శారీరక మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరికొత్త లుక్‌లో కనిపించడానికి ఆయన పడుతున్న శ్రమ, చూపిస్తున్న అంకితభావం చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఆయన స్నేహితుల్లోనూ సరికొత్త ఊపును తీసుకొస్తుంది. `డ్రాగన్` సినిమా కోసం తారక్ పడుతున్న కష్టాన్ని, ఆయనలో వచ్చిన అద్భుతమైన మార్పును చూసి రాజీవ్ కనకాల ఎంతగానో ప్రభావితమయ్యారు. బెస్ట్ ఫ్రెండ్ అంతలా శ్రమిస్తుంటే? తాను మాత్రం పెరిగిన దేహంతో అలాగే ఉండిపోవడం సరికాదని భావించారు.
ఈ నేపథ్యంలో బరువును, పెరిగిన దేహాన్ని సీరియస్‌గా తగ్గించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాజీవ్‌కు గట్టి నమ్మకం కలిగింది. ఒక స్నేహితుడి ఎదుగుదల కష్టం మరొకరికి ఎలా స్ఫూర్తిని ఇస్తుందో చెప్పడానికి మరో ఉదాహ రణ ఇది. నిజానికి రాజీవ్ కనకాల గతంలో కూడా బరువు తగ్గడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. అయితే వివిధ కారణాల తో స్థిరమైన మోటివేషన్ లేకపోవడం వల్ల ఆ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయారు. ఈసారి మాత్రం ఆయన మనసులో ఎలాంటి వెనకడుగు వేసే ఆలోచన లేదు.
ఎందుకంటే కళ్లముందే ఆప్తమిత్రుడు రోల్ మోడల్‌గా నిలిచి అసాధ్యమనుకున్న మార్పును సుసాధ్యం చేసి చూపించడమే అందుకు కారణం. సినిమా హీరోల తరహాలో కఠినమైన వర్కవుట్లు చేసి సిక్స్ ప్యాక్ సాధించక పోయినా? కానీ భారీగా పెరిగిన దేహాన్ని, అనవసరపు కొవ్వును కచ్చితంగా తగ్గించి స్లిమ్‌గా మారడమే ముందున్న టార్గెట్ గా చెప్పుకొచ్చారు. తారక్ స్ఫూర్తితో రాజీవ్ కనకాల ప్రారంభించబోయే ఫిట్‌నెస్ జర్నీ విజయవంతం కావాలని, ఆయన అనుకున్నట్లుగా స్లిమ్‌గా మారి ఆరోగ్యకరమైన రూపాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. స్నేహమంటే కలిసి తిరగడమే కాదు. ఒకరినొకరు మంచి మార్గంలో నడిపించుకోవడం కూడా అని ఇద్దరు మిత్రులు మరోసారి నిరూపిస్తున్నారు.
