ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్? రాజశేఖర్ ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తన కెరీర్‌లో ఎన్నో క్లాసిక్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 23 March 2026 1:06 PM ISTటాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తన కెరీర్‌లో ఎన్నో క్లాసిక్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సరైన కథ కోసం ఎదురుచూస్తూ సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు శర్వానంద్ నటిస్తున్న బైకర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ఆయన హీరో తండ్రి పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రీఎంట్రీపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది.
స్థానం కాదు, పాత్ర బలం ముఖ్యం
బైకర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా తన కెరీర్‌లో వచ్చిన మార్పులను ఆయన ఎంతో ఎమోషనల్ గా షేర్ చేసుకోవడం గమనార్హం. ఇది శర్వానంద్ సినిమా అని చాలా మంది చెప్పినప్పుడు, తాను ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్‌కు వచ్చినట్లేనా? అన్న భావన కలిగిందని ఆయన ఓపెన్‌గా వెల్లడించారు. అయితే అదే సమయంలో తన కుటుంబం ఇచ్చిన మద్దతు తన ఆలోచనను మార్చిందని చెప్పారు. పాత్ర బలం ముఖ్యమని, స్థానం కాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో తాను ఈ సినిమాను అంగీకరించానని వివరించారు. ఈ వ్యాఖ్యలు రాజశేఖర్‌లోని ఎమోషన్ ను మాత్రమే కాకుండా, ఆయనలోని నటుడి పరిపక్వతను కూడా చూపిస్తున్నాయి.
ఎన్నో కథలు విన్నా!
ఇక స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో రాజశేఖర్ తీసుకున్న సమయం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. గత 2-3 సంవత్సరాలుగా ఎన్నో కథలు విన్నప్పటికీ, తనను పూర్తిగా ఆకట్టుకునే కథ రాకపోవడంతో ఏ ప్రాజెక్ట్‌కూ ఓకే చెప్పలేదని తెలిపారు. ఆఖరికి బైకర్ కథ, ముఖ్యంగా తన పాత్ర బాగా మెప్పించడంతోనే ఈ సినిమాను అంగీకరించారని చెప్పారు. ఇది ఆయన పాత్రల ఎంపికలో చూపుతున్న జాగ్రత్తను ప్రతిబింబిస్తోంది.
ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఫ్యూచర్‌లో తాను క్యారెక్టర్ ఆధారిత పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నానని, డైరెక్టర్లు మరియు నిర్మాతలు తనను సంప్రదించాలని కోరారు. ఇది ఆయన కెరీర్‌లో కొత్త దిశగా భావించవచ్చు. ఒకప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్, ఇప్పుడు బలమైన పాత్రలతో మళ్లీ తన స్థానం నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక బైకర్ విషయానికొస్తే, ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. హీరోయిన్‌గా మాళవిక నాయర్ నటిస్తున్నారు. ఏప్రిల్ 3న రిలీజ్ కు రెడీ అవుతున్న బైకర్ సినిమా, రాజశేఖర్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక మలుపు అవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
