Begin typing your search above and press return to search.

రాజ‌శేఖ‌ర్ తెలుసుకోవాల్సిన స‌త్యం

ఒక‌ప్పుడు హీరోగా వైభ‌వం చూసిన‌ సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్.. ఇప్పుడు త‌న ఉనికిని చాటుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు.

By:  Garuda Media   |   27 April 2026 11:06 AM IST
రాజ‌శేఖ‌ర్ తెలుసుకోవాల్సిన స‌త్యం
X

ఒక‌ప్పుడు హీరోగా వైభ‌వం చూసిన‌ సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్.. ఇప్పుడు త‌న ఉనికిని చాటుకోవ‌డానికి క‌ష్ట‌ప‌డుతున్నారు. హీరో వేషాలు వ‌దిలేయ‌డానికి చాలా ఏళ్లు ఆయ‌న‌కు మ‌న‌సొప్ప‌లేదు. మార్కెట్ దాదాపుగా జీరో అయ్యాక కానీ ఆయ‌న‌కు త‌త్వం బోధ ప‌డ‌లేదు. దీంతో త‌ర్వాత‌ క్యారెక్ట‌ర్ రోల్స్ వైపు అడుగులు వేశారు. కానీ ప్ర‌త్యేక పాత్ర చేసిన ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యాన్ డిజాస్ట‌ర్ అయింది. తాజాగా బైక‌ర్ అనే సినిమాలో హీరో తండ్రి పాత్ర చేస్తే దానికి మంచి రెస్పాన్సే వ‌చ్చింది కానీ.. సినిమా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. ఈ సినిమాలో త‌నకొచ్చిన పేరును కెరీర్‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నంలో మీడియాకు వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు రాజ‌శేఖ‌ర్. కానీ అందులో ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు అన‌వ‌స‌ర వివాదాల‌కు దారి తీస్తున్నాయి.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచిన ఠాగూర్ మూవీలో తాను న‌టించాల్సింద‌ని, ముందు రీమేక్ రైట్స్ తాను తీసుకుంటే, త‌ర్వాత ఠాగూర్ మ‌ధు వ‌చ్చి ఎక్కువ రేటు ఇచ్చి హ‌క్కులు తాను తీసుకున్నార‌ని రాజ‌శేఖ‌ర్ వ్యాఖ్యానించారు. ఇదే సంద‌ర్భంలో రైట్స్ తీసుకున్నానే త‌ప్ప అగ్రిమెంట్ చేసుకోలేద‌నే విష‌యాన్ని ఆయన వెల్ల‌డించారు. మ‌రోవైపు జెంటిల్‌మ‌న్ స‌హా తాను మిస్స‌యిన మ‌రికొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల గురించి కూడా ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఐతే ఇప్పుడు ఈ విష‌యాలు చెప్పి అన‌వ‌స‌ర చ‌ర్చ‌, వ్య‌తిరేక‌తకు తావివ్వ‌డం త‌ప్ప ప్ర‌యోజ‌న‌మేంటో రాజ‌శేఖ‌ర్ ఆలోచించాలి. ఇప్పుడీ వీడియో వైర‌ల్ అయి కొంద‌రు రాజ‌శేఖ‌ర్‌కేదో అన్యాయం జ‌రిగిన‌ట్లు మాట్లాడ్డం.. అదే స‌మ‌యంలో మెగా ఫ్యాన్స్ ఎదురుదాడి చేయ‌డం జ‌రుగుతోంది.

ఠాగూర్ సినిమాను త‌న నుంచి లాగేసుకున్నార‌న్న‌ట్లుగా ఆయ‌న చాలా ఏళ్ల నుంచి మాట్లాడుతూ వ‌స్తున్నారు. రాజ‌శేఖ‌ర్‌ ఐతే అగ్రిమెంటే చేసుకోకుండా సినిమా ఎలా త‌న సొంతం అనుకున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఒక‌వేళ ఠాగూర్ సినిమాను రాజ‌శేఖ‌ర్ చేస్తే అంత పెద్ద హిట్ట‌యి ఉండేదా అన్న‌ది కూడా ఆలోచించాలి. అప్ప‌టికే రాజ‌శేఖ‌ర్ కెరీర్ బాగా డౌన్ అయింది. ఆ టైంలో వానత్త‌పోల లాంటి త‌మిళ ఇండ‌స్ట్రీ హిట్‌ను మా అన్న‌య్య పేరుతో రీమేక్ చేస్తే అది ఓ మాదిరిగా ఆడిందంతే. మ‌రో త‌మిళ‌ రీమేక్ సింహ‌రాశి కూడా యావ‌రేజ్‌గానే ఆడింది.

కేవ‌లం చిరు చేయ‌డం వ‌ల్లే ఠాగూర్ సినిమా ఆ రేంజికి వెళ్లింద‌న్న‌ది స్ప‌ష్టం. ఆయ‌న ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా ఆ సినిమాలో మార్పులు చేర్పులు చాలా చేయ‌డం.. చిరు చ‌రిష్మా, ఆయ‌న‌ మార్కు డ్యాన్సులు అన్నీ క‌లిసి సినిమా రేంజిని ఎక్క‌డికో తీసుకెళ్లాయి. కాబ‌ట్టి రాజ‌శేఖ‌ర్ ఠాగూర్స సినిమా చేస్తే మ‌హా అయితే ఓ మోస్త‌రు హిట్ అయ్యేదేమో త‌ప్ప చిరు సినిమాలా సెన్సేష‌న్ క్రియేట్ చేసి ఉండ‌క‌పోవ‌చ్చు. అయినా సినీ రంగంలో ఒక క‌థ ఒక‌రి నుంచి ఇంకొక‌రికి వెళ్ల‌డం స‌ర్వ సాధార‌ణం. ఇలా చేతులు మారిన సినిమాలు కొన్ని హిట్ అవుతుంటాయి. కొన్ని ఫ‌ట్‌మంటుంటాయి. రాజ‌శేఖ‌ర్ సైతం ఇంకెవ‌రో చేయాల్సిన కొన్ని క‌థ‌ల‌ను తాను చేసి ఉంటాడ‌న‌డంలో సందేహం లేదు. కాబ‌ట్టి ఎప్పుడో మిస్ అయిన సినిమాల గురించి ఇప్పుడు బాధ ప‌డి.. అన‌వ‌స‌రంగా అవ‌తలి హీరోల అభిమానుల నుంచి వ్య‌తిరేక‌త ఎదుర్కోవ‌డం త‌ప్ప లాభం శూన్యం.