ఆ సినిమా కోసం 'జెంటిల్‌మేన్' ఆఫర్ వదులుకున్న రాజశేఖర్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ.. శంకర్ దర్శకత్వంలో వచ్చిన సంచలన చిత్రం `జెంటిల్‌మ్యాన్` ఆఫర్ మొదట తనకే వచ్చిందని వెల్లడించారు.
By: Sivaji Kontham | 26 April 2026 10:24 AM ISTటాలీవుడ్ యాంగ్రీ మేన్ రాజశేఖర్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు డేట్స్ సర్దుబాటు కాక గొప్ప సినిమాలను వదులుకోవాల్సి వస్తుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ.. శంకర్ దర్శకత్వంలో వచ్చిన సంచలన చిత్రం `జెంటిల్‌మ్యాన్` ఆఫర్ మొదట తనకే వచ్చిందని వెల్లడించారు. ఆ సినిమా నిర్మాతలు అడ్వాన్స్ పట్టుకుని తన చుట్టూ తిరిగారని.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టును చేయలేకపోయానని ఆయన గుర్తు చేసుకున్నారు.
రాజశేఖర్ ఆ సమయంలో `అల్లరి ప్రియుడు` సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. `అల్లరి ప్రియుడు` కోసం ఇచ్చిన అవే డేట్లు కావాలని పట్టుబట్టడంతో `జెంటిల్‌మ్యాన్` సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అయితే దీని గురించి తాను ఎప్పుడూ విచారించలేదని... కేవలం ఆ సినిమా చేసి ఉంటే బాగుండేదని మాత్రం అనిపించిందని రాజశేఖర్ తన మనసులోని మాటను పంచుకున్నారు. సినిమా ఫలితాల కంటే కూడా వృత్తిపరమైన నిబద్ధతకే ఆయన కట్టుబడి ఉన్నారని దీనిని బట్టి అర్థమవుతుంది.
ప్రేక్షకుల కోణంలో చూస్తే... రాజశేఖర్‌కు `అల్లరి ప్రియుడు` ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అంతవరకు అగ్రెసివ్ హీరోగా ఉన్న ఆయనలోని ఫన్ - ఎంటర్‌టైనింగ్ యాంగిల్‌ను ఈ సినిమా బయటపెట్టింది. ముఖ్యంగా `రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా` వంటి పాటల్లో ఆయన సింపుల్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. యాంగ్రీ మేన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ ఒక లవర్ బాయ్‌గా కూడా మెప్పించగలరని ఈ సినిమా నిరూపించడమే గాక.. ఆయన కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.
మరోవైపు `జెంటిల్‌మ్యాన్` సినిమా యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పింది. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడైన అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఆ సినిమాలోని యాక్షన్ , ఎమోషనల్ సీక్వెన్స్‌లకు సరిగ్గా సరిపోయింది. శంకర్ మేకింగ్, అర్జున్ నటన తోడై ఆ సినిమా అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఒకవేళ రాజశేఖర్ ఈ సినిమా చేసి ఉంటే.. ఆయన ఇమేజ్ మరో స్థాయిలో ఉండేదని విశ్లేషకులు భావిస్తుంటారు. బహుశా రాజశేఖర్ ఉన్న యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ చూసే శంకర్ ఈ స్క్రిప్టుతో అతడిని సంప్రదించి ఉండవచ్చు.
ఇద్దరు నటులు తమకు దక్కిన అవకాశాలకు పూర్తి న్యాయం చేశారు. అర్జున్ `జెంటిల్‌మ్యాన్`గా యాక్షన్ హీరోగా స్థిరపడగా, రాజశేఖర్ `అల్లరి ప్రియుడు`గా క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. వీరిద్దరూ డ్యాన్సింగ్ స్టార్స్ కాకపోయినా.. తమదైన నటనతో ఆయా చిత్రాలను చిరస్థాయిగా నిలిపారు. ఒక సినిమా ఆఫర్ చేజారినా.. మరో గొప్ప సినిమాతో కెరీర్‌ను నిర్మించుకోవచ్చని రాజశేఖర్ ప్రయాణం నిరూపించింది. ది జెంటిల్ మేన్ సినిమాతో యాక్షన్ కింగ్ అర్జున్ స్థాయి పదింతలు పెరిగింది అంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రంలో అతడి ఎమోషనల్ యాక్షన్ మూవ్ మెంట్స్ ఇప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచి ఉన్నాయి.
