Begin typing your search above and press return to search.

మారుతికి మళ్లీ తప్పదా?

‘రాజాసాబ్’ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని మామూలుగా ఆడుకోలేదు.

By:  Garuda Media   |   6 Feb 2026 6:00 AM IST
మారుతికి మళ్లీ తప్పదా?
X

ప్రభాస్‌తో సినిమా అంటే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడంటూ మారుతి గురించి అందరూ మాట్లాడుకున్నారు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘ది రాజాసాబ్’ రిలీజయ్యాక అసలెందుకు ప్రభాస్‌తో సినిమా చేశానా అని మారుతి ఫీలయ్యేలా వ్యవహారం తయారైంది. ‘రాజాసాబ్’ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని మామూలుగా ఆడుకోలేదు. కొన్ని రోజుల పాటు అదే పనిగా సోషల్ మీడియాలో అతణ్ని టార్గెట్ చేస్తూ ట్రెండ్స్ చేశారు. సినిమాలోని ఒక్కో సన్నివేశం తాలూకు ఫొటోలు, వీడియోలు పెట్టి ఇలా ఎలా తీయాలనిపించింది.. ఈ షాట్ ఎలా పెట్టావు అంటూ శూల శోధనతో మారుతిని బూతులు తిట్టారు.

మరోవైపు ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ‘రాజాసాబ్’ షూటింగ్‌లో డూపుల్ని వాడడం గురించి మారుతి చేసిన కామెంట్లు ప్రభాస్‌కు డ్యామేజింగ్‌గా మారడం వల్ల కూడా ఫ్యాన్స్ అతణ్ని దారుణంగా దూషించారు. వ్యవహారం శ్రుతి మించి మారుతి మిత్రుడు ఎస్కేఎన్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. అయినా ప్రభాస్ ఫ్యాన్సేమీ తగ్గలేదు. ప్రి రిలీజ్ ఈవెంట్లో మారుతి చెప్పిన తన ఇంటి అడ్రస్ పట్టుకుని ‘క్యాష్ ఆన్ డెలివరీ’ మీద పెద్ద సంఖ్యలో ఫుడ్ ఆర్డర్లు పెట్టి అతణ్ని ఇబ్బంది పెట్టారు. ఐతే ఈ మధ్యే ఈ గొడవ కాస్త సద్దుమణిగినట్లు అనిపిస్తోంది.

కానీ రేపట్నుంచి మళ్లీ మారుతిని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ‘రాజాసాబ్’ జియో హాట్ స్టార్ ద్వారా డిజిటల్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో ఫ్యాన్స్ మళ్లీ సినిమా చూసి.. ఒక్కో సన్నివేశం గురించి విశ్లేషిస్తూ మారుతిని టార్గెట్ చేస్తే ఆశ్చర్యం లేదు. భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన ఏ సినిమా ఓటీటీలోకి వచ్చినా కొన్ని రోజుల పాటు దాని మీద విశ్లేషణలు నడవడం, మేకర్స్ మీద ఫ్యాన్స్ మండిపడుతూ పోస్టులు పెట్టడం, ట్రోల్స్ చేయడం మామూలే. కాబట్టి మారుతికి మళ్లీ కొన్ని రోజులు తలనొప్పి తప్పదన్నట్లే. కాగా తొలి రోజుల్లో ‘రాజాసాబ్’ సినిమాలో మిస్ అయిన ఓల్డ్ కింగ్ ఎపిసోడ్‌తో పాటు కొన్ని అదనపు సన్నివేశాలను కూడా కలిపి స్ట్రీమ్ చేయబోతోంది హాట్ స్టార్.