Begin typing your search above and press return to search.

జక్కన్న డేట్‌పై ఇంత ధీమా.. వెనుక ప్లానింగ్ అదేనా!

నిజానికి రాజమౌళి ఈసారి భారీ యాక్షన్ ఎపిసోడ్లను ముందుగానే పూర్తి చేశారు. కొన్ని నెలల క్రితమే కీలకమైన యాక్షన్ సన్నివేశాలన్నీ చిత్రీకరించినట్లు స్వయంగా వెల్లడించారు.

By:  M Prashanth   |   29 Oct 2026 6:35 PM IST
జక్కన్న డేట్‌పై ఇంత ధీమా.. వెనుక ప్లానింగ్ అదేనా!
X

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్, ఏళ్ల తరబడి షూటింగ్, పర్ఫెక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకోవడం గురించి తెలిసిందే. రిలీజ్ డేట్ ప్రకటించినా చివరి నిమిషంలో మార్పులు ఉంటాయేమోనని అభిమానులు టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' వాయిదాలతో షాక్ ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం 'వారణాసి' విషయంలో చిత్రబృందం మొదటి నుంచి ఒకే తేదీపై గట్టిగా నిలబడుతోంది. దీని వెనుక జక్కన్న ప్లానింగ్ కూడా ఆసక్తికరంగా ఉంది.

లేటెస్ట్ గా 'డాడ్స్ లిటిల్ ఫ్రెండ్' కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ ఇదే విషయాన్ని మరోసారి చెప్పారు. మహేష్ బాబు 'వారణాసి' 2027 ఏప్రిల్ 7న తప్పకుండా విడుదలవుతుందని స్పష్టం చేశారు. నిజంగా ఆ తేదీకి వస్తుందా అని యాంకర్ మరోసారి ప్రశ్నించినా ఏమాత్రం తడబడలేదు. ఈ ధీమాకు తగ్గట్లుగానే షూటింగ్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.

నిజానికి రాజమౌళి ఈసారి భారీ యాక్షన్ ఎపిసోడ్లను ముందుగానే పూర్తి చేశారు. కొన్ని నెలల క్రితమే కీలకమైన యాక్షన్ సన్నివేశాలన్నీ చిత్రీకరించినట్లు స్వయంగా వెల్లడించారు. మిగిలిన చిన్న చిన్న సన్నివేశాలను సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. సెప్టెంబర్‌లోనే మహేష్ తన పోర్షన్ షూటింగ్ ముగించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సినిమా పూర్తవడానికి అవసరమైన అసలు పని దాదాపుగా పూర్తయినట్లయింది.

మరోవైపు వీఎఫ్ఎక్స్ విషయంలో కూడా జక్కన్న వర్కింగ్ స్టైల్ మార్చుకున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఎదురుచూడకుండా ఒక్కో సీన్ పూర్తవగానే ఎడిటింగ్ చేసి గ్రాఫిక్స్ టీమ్‌కు పంపిస్తున్నారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు షూటింగ్‌తో పాటే కొనసాగుతున్నాయి. అంత భారీ సినిమాకు చివర్లో గ్రాఫిక్స్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి తగ్గించుకోవడమే ఈ ప్లానింగ్ వెనుక ఉద్దేశం.

అయితే 'వారణాసి' మేకింగ్ మాత్రం మామూలుగా లేదు. అంటార్కిటికా నుంచి ఆఫ్రికా వరకు వివిధ ప్రాంతాల నేపథ్యంలో కథ సాగుతుంది. పురాణ ఘట్టాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఐమ్యాక్స్‌కు తగ్గ విజువల్స్ కోసం స్పెషల్ గా పనిచేశారు. ఇంత భారీ కాన్వాస్ ఉన్నప్పుడు ప్రతి సన్నివేశానికి గ్రాఫిక్స్, సౌండ్ డిజైన్, ఫైనల్ ఎడిటింగ్ విషయంలో ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందుకే ముందుగానే పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 'వారణాసి'ని రెండు భాగాలుగా కాకుండా ఒకే సినిమాగా తీసుకొస్తున్నారు. దాదాపు మూడు గంటల నిడివితో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రాజమౌళి గతంలో చెప్పారు. మరోవైపు కీరవాణి ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఏప్రిల్ 7 బుధవారం కావడంతో వీకెండ్‌కు ముందే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ ప్లానింగ్ కూడా కీలకంగా మారనుంది.