'వారణాసి' డాక్యుమెంటరీ వెనుక వ్యూహం!
రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
By: Srikanth Kontham | 18 Aug 2026 10:38 PM ISTరాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్-గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సినిమా ప్రేమికులను అంతకంతకు ఆకట్టుకుంటోంది. తాజాగా చిత్ర షూటింగ్ తీరుతెన్నులపై ప్రత్యేక డాక్యుమెంటరీని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు రావడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది. సాధారణంగా పెద్ద సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత మేకింగ్ వీడియోలను విడుదల చేస్తుంటారు. కానీ రాజమౌళి మాత్రం షూటింగ్ జరుగు తున్నప్పుడే సమాంతరంగా డాక్యుమెంటరీని ప్లాన్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ భారీ ప్రాజెక్ట్ మేకింగ్ డాక్యుమెంటరీని రూపొందించే బాధ్యతను జార్జియన్ డైరెక్టర్ గొగిత చిక్వాడ్ జేకు అప్పగించడం విశేషం. హాలీవుడ్ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న సినిమా నిర్మాణ శైలిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు విదేశీ దర్శకుడిని రంగంలోకి దించారు. ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచి నటినటుల వర్క్‌షాప్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, అత్యాధునిక సెట్ల నిర్మాణం వంటి ప్రతి అంశాన్ని గొగిత చిక్వాడ్ జే తన కెమెరాలో అత్యద్భుతంగా బంధిస్తున్నారు. రాజమౌళి ఆలోచనలకు తగినట్లుగా డాక్యుమెంటరీని హాలీవుడ్ స్టాండర్డ్స్‌కు తగ్గకుండా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యూహం వెనుక రాజమౌళికి పక్కా ఇంటర్నేషనల్ ప్లాన్ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` సినిమాల సమయంలో మేకింగ్ వీడియోలను సిద్ధం చేయడానికి వాటిని ప్రమోట్ చేయడానికి యూనిట్ చాలా సమయం వెచ్చించాల్సి వచ్చింది. అయితే `వారణాసి` సినిమా రేంజ్ కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నందున షూటింగ్ సమయంలోనే డాక్యుమెంటరీని రెడీ చేయడం ద్వారా సమయం వృధా కాకుండా చూస్తున్నారు. సినిమా విడుదలకు ముందే మేకింగ్ డాక్యు మెంటరీని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం ద్వారా సినిమాపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేయోచ్చు.
ఇలాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లకు నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం చాలా కీలకం. `వారణాసి` డాక్యుమెంటరీకి అంతర్జాతీయ స్థాయిలో భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి వర్కింగ్ స్టైల్ , విజువల్ వండర్స్ ఎలా రూపుదిద్దుకుంటాయో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ మేధావులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో మేకింగ్ డాక్యుమెంటరీని కేవలం ఒక ప్రచార సాధనంగా కాకుండా? నిర్మాతలు విలువైన ప్యాకేజీలా అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయం ద్వారా రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించడం మాత్రమే కాకుండా ఆ సినిమా మేకింగ్ జర్నీని కూడా గ్లోబల్ ప్రొడక్ట్‌గా మారుస్తున్నారని చెప్పొచ్చు. హాలీవుడ్ సినిమాలకు దీటుగా దేశంలోనూ మేకింగ్ డాక్యుమెం టరీలను కమర్షియల్ అసెట్‌గా మార్చవచ్చని జక్కన్న నిరూపిస్తున్నారు. జార్జియన్ దర్శకుడి చేతికి ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయా దేశాల టెక్నీషియన్ల నైపుణ్యాన్ని వాడుకుంటూనే సినిమాకు గ్లోబల్ అప్పీల్ తెచ్చేందుకు రాజమౌళి వేసిన ముందడుగు ఇది.
`వారణాసి` కోసం రాజమౌళి అనుసరిస్తున్న సరికొత్త పద్ధతి ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కి స్తుందడంలో సందేహం లేదు. సినిమా షూటింగ్‌తో పాటే డాక్యుమెంటరీని కూడా సిద్ధం చేయడం ద్వారా ప్రేక్షకులకు అరుదైన సినిమాటిక్ అనుభూతిని ముందుగానే పంచాలని జక్కన్న భావిస్తున్నారు.
