క్లైమాక్స్ దశలో వారణాసి.. సెట్స్‌పై మరో భారీ యుద్ధానికి సన్నాహాలు
భారతీయ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరిగినప్పుడు తప్పకుండా వినిపించే పేర్లలో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు.
By: Sravani Lakshmi Srungarapu | 7 July 2026 1:16 PM ISTభారతీయ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరిగినప్పుడు తప్పకుండా వినిపించే పేర్లలో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. అంతర్జాతీయ వేదికలపై వరుస గౌరవాలు అందుకుంటూనే, మరోవైపు తన కొత్త ప్రాజెక్ట్ వారణాసిని పూర్తి చేసే దిశగా ఆయన వేగంగా అడుగులేస్తున్నారు. విదేశాల్లో ప్రశంసలు అందుకున్న వెంటనే మళ్లీ షూటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టడం రాజమౌళి పని తీరుకు మరో ఉదాహరణగా మారింది.
ప్రస్తుతం వారణాసి ప్రొడక్షన్ కీలక దశలోకి చేరింది. షూటింగ్ లో ఎక్కువ భాగం పూర్తవడంతో, మిగిలిన షెడ్యూళ్లను వేగంగా పూర్తి చేసేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా తగిన సమయం కేటాయించేలా షెడ్యూలింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ రేంజ్ టెక్నికల్ వర్క్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్న నేపథ్యంలో, షూటింగ్ పూర్తయ్యాక కూడా దీర్ఘకాలిక పోస్ట్ ప్రొడక్షన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. టార్గెట్ గా పెట్టుకున్న రిలీజ్ డేట్ కు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి దశను ముందుగానే ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
రాబోయే షెడ్యూల్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో రూపొందించనున్న భారీ యుద్ధ ఘట్టం ఈ షెడ్యూల్‌లో మెయిన్ ఎట్రాక్షన్ గా ఉండనుంది. భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు తెరకెక్కిన అతిపెద్ద వార్ ఎపిసోడ్స్‌లో ఒకటిగా నిలిచేలా జక్కన్న దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం. సెట్స్‌పై షూట్ చేసే ఈ సీన్ ను తరువాత అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రణాళిక కూడా ఉందని తెలుస్తోంది. రాజమౌళి సినిమాల భారీ కాన్వాస్‌ను ఈ ఎపిసోడ్ మరోసారి గుర్తు చేయబోతోందనే అంచనాలు ఈ వార్ ఎపిసోడ్‌పై ఉన్నాయి.
ఇదిలా ఉండగా, ఫ్రాన్స్ పర్యటనలో రాజమౌళికి లభించిన గౌరవం భారతీయ సినీ పరిశ్రమకు మరో గుర్తింపుగా నిలిచింది. ఆయన సినిమాల స్పెషల్ స్క్రీనింగ్స్, సినీ స్టూడెంట్స్ మరియు ఆడియన్స్ తో నిర్వహించిన చిట్‌చాట్స్, మాస్టర్ క్లాసులకు వచ్చిన రెస్పాన్స్ ఇండియన్ స్టోరీలపై అంతర్జాతీయ ఆసక్తి ఎంతగా పెరిగిందో మరోసారి చూపించింది. తెలుగు భాషలో రూపొందిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయనే విషయానికి ఇది బలమైన నిదర్శనంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రతిష్టాత్మక వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్ లో రాజమౌళి పేరు చేరడం కూడా ఆయన సినీ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. ప్రపంచ సినీ రంగంలో విశిష్ట ముద్ర వేసిన డైరెక్టర్ల సరసన చోటు దక్కడం ద్వారా ఇండియన్ డైరెక్టర్ల ప్రతిష్ట మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బాహుబలి: ది ఎటర్నల్ వార్ కు సంబంధించిన తాజా వివరాలను కూడా రాజమౌళి పంచుకోవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఒకవైపు వారణాసిని ముగింపు దశకు తీసుకెళ్తూనే, మరోవైపు బాహుబలి వరల్డ్ ను విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టమవుతోంది. దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న ఈ రెండు భారీ ప్రాజెక్టులు, భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిని మరింత బలోపేతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
