'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న 'వారణాసి' నుంచి ఏడాదిగా కొత్త వీడియో రాకపోవడంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమాకు ఐదు నెలలే సమయం ఉండటంతో ప్రమోషన్లపై ఆసక్తి పెరిగింది. నవంబర్ 15తో కాన్సెప్ట్ వీడియోకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో క్రిస్మస్‌లోపు కొత్త అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
By: M Prashanth | 12 Nov 2026 3:24 PM ISTరాజమౌళి సినిమా కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడటం అభిమానులకు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మహేష్ బాబు సినిమా కావడంతో ఆ ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతి చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెతుకుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో 'వారణాసి' కాన్సెప్ట్ వీడియోను భారీ ఈవెంట్లో విడుదల చేశారు. అప్పట్లో ఆ విజువల్స్ చూసి అభిమానులు బాగా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఏడాది గడుస్తున్నా మరో పెద్ద వీడియో మాత్రం రాలేదు.
నిజానికి రాజమౌళి సినిమాలకు రెగ్యులర్ ప్రమోషన్ల అవసరం పెద్దగా ఉండదు. ఆయన ఒక్క వీడియో విడుదల చేసినా దేశవ్యాప్తంగా మంచి బజ్ వస్తుంది. 'బాహుబలి', 'RRR' సినిమాలతో సంపాదించుకున్న క్రేజ్ అలాంటిది. అయితే ఈసారి 'వారణాసి' విషయంలో అదే పద్ధతి ఎంతవరకు పనిచేస్తుందనేది ఆసక్తికరం. ఎందుకంటే ఇది కేవలం తెలుగు, హిందీ ప్రేక్షకుల కోసమే తీస్తున్న సినిమా కాదు. అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా టార్గెట్ చేస్తున్నారు.
మరోవైపు 'వారణాసి' కాన్సెప్ట్ వీడియోలోనే రాజమౌళి చాలా విషయాలు చూపించారు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలు, అడ్వెంచర్, రామాయణంలోని కుంభకర్ణుడి ఎపిసోడ్‌తో సినిమాపై అంచనాలు పెంచారు. మహేష్ బాబును కొత్త లుక్‌లో చూపించారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను కూడా పరిచయం చేశారు. అయితే సినిమా ఎలా ఉండబోతోందనే పూర్తి అవగాహన మాత్రం ఆ వీడియోతో రాలేదు.
ఇక 'RRR' సమయంలో పరిస్థితి వేరు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ అప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ఉంది. కానీ మహేష్ బాబుకు 'వారణాసి' మొదటి పాన్ ఇండియా సినిమా. అలాంటి హీరోను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలంటే రాజమౌళి పేరు ఒక్కటే కాకుండా సినిమా కంటెంట్‌ను కూడా ఎక్కువగా చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హిందీ, విదేశీ ప్రేక్షకులకు కథలోని ప్రధాన అంశాలను పరిచయం చేయడం ఉపయోగపడుతుంది.
ఇప్పటికే 'వారణాసి' విడుదలకు 2027 ఏప్రిల్ 7 అని తేదీని ప్రకటించారు. అంటే సినిమాకు ఇంకా ఐదు నెలల సమయమే ఉంది. ఈ గ్యాప్‌లో పాటలు, పాత్రలకు సంబంధించిన వీడియోలు, ట్రైలర్ వంటి ప్రమోషన్లు చేయాల్సి ఉంటుంది. గతంలో 'RRR' కోసం రాజమౌళి పలు నగరాల్లో ఈవెంట్లు నిర్వహించారు. ఈసారి విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి రావచ్చు.
అయితే ఇంతకాలం కొత్త వీడియో రాకపోవడం వల్ల సినిమాపై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మహేష్, రాజమౌళి కాంబినేషన్‌కు ఉన్న డిమాండ్ ఇప్పటికీ భారీగానే ఉంది. కానీ గత ఏడాది వచ్చిన కాన్సెప్ట్ వీడియోనే మళ్లీ మళ్లీ చూపిస్తూ విడుదల వరకు వెళ్లడం కష్టం. నవంబర్ 15తో ఆ వీడియోకు ఏడాది పూర్తవుతోంది. ఆ తేదీకి కొత్త అప్డేట్ వస్తుందనే ప్రచారం ఉన్నా చిత్రబృందం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి క్రిస్టమస్ లోపు ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.
