రాజమౌళిని చూసి ఆశ్చర్యపోతున్న టీం
కానీ ‘వారణాసి’ షూటింగ్ నడుస్తున్న తీరు చూసి.. టీం అంతా ఆశ్చర్యపోతోందట. ఈ మూవీ షూటింగ్ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిపోతోందట.
By: Garuda Media | 20 April 2026 4:13 PM ISTరాజమౌళి ఒకప్పుడు సగటు మాస్ మసాలా సినిమాలు తీసినవాడే. కానీ ‘మగధీర’ నుంచి ఆయన ప్రయాణం మారిపోయింది. ఆ సినిమాలో ఆయన విజన్ చూసి అందరూ ఒక్కసారిగా షాకైపోయారు. ఆయన సృష్టించిన విజువల్ మాయాజాలానికి ఫిదా అయిపోయారు. ఇలాంటి సినిమాలు తీయడం వెనుక ఉండే కష్టం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఔట్ అంత గొప్పగా రాదు. ఆపై ఈగ, బాహుబలి, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో రాజమౌళి చూపించిన భారీతనం, చేసిన విజువల్ మాయాజాలం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఔట్ పుట్ విషయంలో రాజీకి రవ్వంతైనా అవకాశం ఇవ్వడు కాబట్టి రాజమౌళి సినిమాలు ఆలస్యం కావడం అన్నది మామూలైపోయింది. ఆయన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు అయిపోతుంటాయి. చెప్పిన డేటుకు సినిమాలు రిలీజ్ కావు. వీటన్నింటికీ ఆయనతో పని చేసేవాళ్లే కాదు.. ప్రేక్షకులు కూడా అలవాటు పడిపోయారు. జక్కన్న కొత్త సినిమా ‘వారణాసి’ కూడా ఆటోమేటిగ్గా ఆలస్యం అవుతుందని.. చెప్పిన డేటుకు రావడం సందేహమే అనే అభిప్రాయంతోనే చాలామంది ఉన్నారు.
కానీ ‘వారణాసి’ షూటింగ్ నడుస్తున్న తీరు చూసి.. టీం అంతా ఆశ్చర్యపోతోందట. ఈ మూవీ షూటింగ్ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిపోతోందట. ఇటీవల ఒక నెల రోజుల పాటు హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్లో కీలక సన్నివేశాల షూటింగ్ జరిపిన టీం.. ఇప్పుడు మరో సెట్లో ఓ పాట చిత్రీకరణకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ముందు అనుకున్న ప్రకారమే ఆగస్టుకల్లా షూట్ పూర్తి చేసే దిశగా టీం అడుగులు వేస్తోందట. ఇప్పటికే షూట్ 70 శాతం దాకా అయిపోయినట్లు సమాచారం. మరోవైపు సమాంతరంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి.
షూట్ ముగిశాక ఆరేడు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయి. అదే సమయంలో ప్రమోషన్ కూడా నడుస్తుంది. ఇప్పటిదాకా అంతా అనుకున్న ప్రకారమే జరుగుతోంది. ఇకముందూ అలాగే ఉంటే.. చెప్పినట్లే ఏప్రిల్ 7కు ఈ సినిమా రిలీజ్ కావడం పక్కా. రాజమౌళితో ఎన్నో ఏళ్లుగా కలిసి పని చేస్తూ ఆలస్యాలకు, వాయిదాలకు అలవాటు పడిపోయిన ఆయన టీం సభ్యులు.. ఈసారి అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగిపోతుండడం చూసి ఆశ్చర్యపోతున్నారట. మరి రిలీజ్ వరకు ఇదే టెంపోను జక్కన్న మెయింటైన్ చేస్తారేమో చూడాలి.
