సాంగ్ షూట్‌తోనే హైప్ పెంచిన వారణాసి.. రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఇదే!
టాలీవుడ్‌లో భారీ సినిమాలంటే సాధారణంగా సంవత్సరాల పాటు కొనసాగే షూటింగ్‌లు, తరచూ వాయిదాలు, అప్‌డేట్స్ కోసం ఎదురుచూసే అభిమానులు గుర్తుకొస్తారు.
By: Sravani Lakshmi Srungarapu | 22 May 2026 12:00 AM ISTటాలీవుడ్‌లో భారీ సినిమాలంటే సాధారణంగా సంవత్సరాల పాటు కొనసాగే షూటింగ్‌లు, తరచూ వాయిదాలు, అప్‌డేట్స్ కోసం ఎదురుచూసే అభిమానులు గుర్తుకొస్తారు. కానీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా సాగుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలుమార్లు లొకేషన్ మారుస్తూ విభిన్న షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతంలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో కీలకమైన సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ లో మహేష్ బాబు కూడా పాల్గొనడం విశేషం.
రాజమౌళి గత సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రాజెక్టులు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకున్నాయి. కానీ వారణాసి విషయంలో మాత్రం ఆయన ప్లానింగ్ పూర్తిగా కొత్త దిశలో సాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందుగానే పూర్తి ప్రీ విజువలైజేషన్, షెడ్యూల్ ప్లానింగ్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగం వంటి అంశాల వల్ల షూటింగ్ వేగం పెరిగిందని టాలీవుడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి షెడ్యూల్‌ను కచ్ఛితమైన టైమ్‌లైన్‌తో పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు అభిమానుల్లో మరింత నమ్మకాన్ని పెంచుతోంది. ఎందుకంటే భారీ అంచనాలున్న సినిమాలు ఆలస్యం కాకుండా ప్లాన్ ప్రకారం ముందుకు సాగడం చాలా అరుదుగా కనిపించే విషయం.
కాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచింది. ఇక రాజమౌళి స్టైల్‌లో కథను గ్లోబల్ లెవల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారని ప్రచారం సాగుతోంది. తాజాగా జరుగుతున్న సాంగ్ షూట్ కూడా కేవలం సాంగ్ కోసమే కాకుండా కథలో కీలకమైన విజువల్ టర్నింగ్ పాయింట్‌గా ఉండబోతుందనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రాజమౌళి సినిమాల్లో పాటలు కూడా కథను ముందుకు తీసుకెళ్లేవిగా నిలుస్తాయనే విషయం తెలిసిందే.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ఆకర్షణగా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి- కీరవాణి కాంబినేషన్ నుంచి వస్తున్న ఆల్బమ్ కావడంతో మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిర్మాతలు కెఎల్ నారాయణ, ఎస్.ఎస్ కార్తికేయ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్నేషనల్ లొకేషన్స్ పరంగా వారణాసి భారతీయ సినిమాకు కొత్త స్థాయి తీసుకురాబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ స్పీడ్ చూస్తుంటే వారణాసి కేవలం మరో రాజమౌళి సినిమాలా కాదు, ఇండియన్ సినిమా మేకింగ్ స్టైల్‌ను మార్చే ప్రాజెక్ట్‌గా నిలవొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే అభిమానులు ప్రతి చిన్న అప్‌డేట్‌ను వైరల్ చేస్తుండగా, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అన్న ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది.
