నోలాన్ రేంజ్‌లో జక్కన్న విజువల్ ట్రీట్: 'వారణాసి' ఐమాక్స్ టెక్నిక్ మతి చెడేలా!
బాహుబలి, RRR వంటి అంతర్జాతీయ స్థాయి బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమా ఎల్లలను విస్తరించిన సంచలన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`తో మరో భారీ ముందడుగు వేస్తున్నారు.
By: Sivaji Kontham | 27 Jun 2026 3:00 PM ISTబాహుబలి, RRR వంటి అంతర్జాతీయ స్థాయి బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమా ఎల్లలను విస్తరించిన సంచలన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`తో మరో భారీ ముందడుగు వేస్తున్నారు. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తరహాలో రాజమౌళి ఈ చిత్రంలోని కొంత భాగాన్ని భారీ 70ఎంఎం ఐమాక్స్ (IMAX) ఫిల్మ్‌పై చిత్రీకరిస్తున్నారు. రెగ్యులర్ కెమెరా ఫార్మాట్‌ల కంటే ఎంతో విశాలమైన ఫ్రేమ్ పరిమాణాన్ని... అత్యున్నత దృశ్య నాణ్యతను ఇచ్చే ఈ ఐమాక్స్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రేక్షకులకు థియేటర్లలో మునుపెన్నడూ లేని ఒక సరికొత్త విజువల్ వండర్‌ను అందించేందుకు జక్కన్న అసాధారణ ప్రయత్నం చేస్తున్నారు.
సినిమాస్కోప్ వర్సెస్ ఐమాక్స్:
సాధారణంగా ఐమాక్స్ థియేటర్ల కోసం సినిమా తీసేటప్పుడు మేకింగ్ స్టైల్ మార్చాల్సి వస్తుంది. దీనిపై రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ఐమాక్స్ ఫార్మాట్ తన సృజనాత్మక కోణాన్ని మార్చలేదని... దానికి పూర్తి విరుద్ధంగా చిత్రీకరణ ప్రాసెస్ జరిగిందని వెల్లడించారు. ``మొదటి నుంచీ మేము డిజైన్ చేసిన సన్నివేశాలు ఐమాక్స్ ఫార్మాట్‌కు అద్భుతంగా సరిపోతాయని మాకు తెలుసు. కేవలం ఫార్మాట్ కోసం మేము కథనంలో ఏమీ మార్చలేదు`` అని జక్కన్న స్పష్టం చేశారు. అయితే ఇన్నాళ్లూ తమ కళ్ళు రెగ్యులర్ `సినిమాస్కోప్` వైడ్ ఫార్మాట్‌లో చిత్రీకరించడానికి అలవాటు పడ్డాయని... వ్యక్తిగతంగా ఆ ఫార్మాట్ అంటే తనకు ఎంతో ఇష్టమని కూడా ఆయన పేర్కొన్నారు.
అద్భుతమైన అనమార్ఫిక్ ఫ్రేమింగ్ కసరత్తు
ఈ సాంకేతిక మార్పు కోసం చేసిన సర్దుబాట్లు చాలా స్వల్పమైనవని రాజమౌళి వివరించారు. ఐమాక్స్ స్క్రీన్లపైనా, అలాగే సాధారణ థియేటర్లలోని సినిమాస్కోప్ (అనమార్ఫిక్ ఫ్రేమింగ్) స్క్రీన్లపైనా ఒకే దృశ్యం ఏకకాలంలో అద్భుతంగా కనిపించేలా ఫ్రేమ్ చేయడంపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. షూటింగ్ ప్రారంభించిన మొదటి కొన్ని రోజులు ఈ రెండు ఫార్మాట్లకు సరిపోయేలా కెమెరా యాంగిల్స్ సర్దుబాటు చేసుకోవడం కొంత సవాలుగా అనిపించినా... ఆ తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తమ బృందానికి పూర్తి అవగాహన వచ్చిందని జక్కన్న వెల్లడించారు.
ఐమ్యాక్స్ విజువల్స్ కోసం నోలాన్ కసరత్తు:
హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ డిజిటల్ టెక్నాలజీ వైపు వెళ్లకుండా... సాంప్రదాయ ఫిల్మ్ మేకింగ్‌ను, ముఖ్యంగా 70ఎంఎం ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌ను అమితంగా ఇష్టపడతారు. ఆయన తన చిత్రాల్లోని భారీ యాక్షన్, ల్యాండ్‌స్కేప్ సన్నివేశాలను ఐమాక్స్ 15-ఫ్రెంచ్ 70ఎంఎం కెమెరాలతో చిత్రీకరిస్తూనే... సాధారణ థియేటర్ల కోసం వాటిని అనామోర్ఫిక్ సినిమాస్కోప్ (35 ఎంఎం లేదా స్టాండర్డ్ 65 ఎంఎం ఫిల్మ్) తో బ్యాలెన్స్ చేస్తారు. ఇందుకోసం ఆయన ప్రధానంగా `డ్యూయల్ ఫ్రేమింగ్` ..`ఓపెన్ మ్యాట్` టెక్నిక్‌లను అనుసరిస్తారు. షూటింగ్ సమయంలోనే కెమెరా లెన్స్‌పై ఒకేసారి రెండు ఫార్మాట్లకు సరిపోయేలా గైడ్ లైన్స్ ఉంచుకుని... ఐమాక్స్ స్క్రీన్‌పై నిలువుగా (1.43:1 యాస్పెక్ట్ రేషియో) అదనపు విజువల్స్ కనిపించేలా... అదే దృశ్యం సాధారణ థియేటర్లలో వెడల్పుగా (2.40:1 సినిమాస్కోప్) కట్ అయినా కథలోని ప్రధాన యాక్షన్ దెబ్బతినకుండా కంపోజ్ చేస్తారు. ఐమాక్స్ కెమెరాల శబ్దం ఎక్కువగా ఉండడం వల్ల డైలాగ్ సీన్స్ కోసం నిశ్శబ్దంగా ఉండే స్టాండర్డ్ కెమెరాలను, యాక్షన్ సీన్స్ కోసం ఐమాక్స్ కెమెరాలను మార్చి మార్చి వాడడం నోలాన్ మార్క్ టెక్నిక్.
నోలాన్ తన కెరీర్‌లోని విభిన్న చిత్రాలను కథా అవసరాలకు అనుగుణంగా విభిన్న ఫార్మాట్లలో చిత్రీకరించారు. ఆయన మైండ్-బెండింగ్ మాస్టర్‌పీస్ `ఇన్‌సెప్షన్` చిత్రాన్ని భారీ ఐమాక్స్ కెమెరాలను ఉపయోగించకుండా... పూర్తిగా సాంప్రదాయ 35ఎంఎం అనామోర్ఫిక్ సినిమాస్కోప్ లో.. కొన్ని కీలక సీన్లను 65 ఎంఎం లార్జ్ ఫార్మాట్ ఫిల్మ్‌పై చిత్రీకరించారు. ఇక ఆస్కార్ విజేతగా నిలిచిన `ఓపెన్‌హీమర్` చిత్రాన్ని నోలాన్ అత్యున్నత స్థాయి 65 ఎంఎం ఐమాక్స్ - స్టాండర్డ్ 65ఎంఎం లార్జ్ ఫార్మాట్ ఫిల్మ్ కలయికతో రూపొందించారు. ప్రత్యేకంగా ఈ సినిమా కోసం హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ ఫిల్మ్‌ను కూడా తయారు చేయించి వాడారు.
అంతరిక్ష నేపథ్యంతో ఆయన తీసిన క్లాసిక్ `ఇంటర్‌స్టెల్లార్` ..2026లో వస్తున్న తదుపరి ప్రాజెక్ట్ `ది ఒడిస్సీ`లను పరిశీలిస్తే, నోలాన్ తన ప్రతీ భారీ చిత్రానికి ఇదే తరహా 70 ఎంఎం ఐమాక్స్ - సినిమాస్కోప్ బ్యాలెన్సింగ్ ఫార్మాట్‌ను ప్రాణంగా నమ్ముకున్నారు.
