Begin typing your search above and press return to search.

రాజమౌళి హాలీవుడ్ గేమ్ ప్లాన్.. అసలు లెక్క ఇదేనా?

అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాను కేవలం ఇండియన్ లెవల్‌లోనే కాకుండా హాలీవుడ్, యూరప్, చైనా మార్కెట్లలో భారీగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   25 March 2026 10:49 PM IST
రాజమౌళి హాలీవుడ్ గేమ్ ప్లాన్.. అసలు లెక్క ఇదేనా?
X

రాజమౌళి ఏ పని చేసినా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లోకి హాలీవుడ్ మీడియాకు మాత్రమే స్పెషల్ యాక్సెస్ ఇస్తూ, లోకల్ మీడియాను, తెలుగు జర్నలిస్టులను దూరంగా ఉంచుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మన వాళ్లను కాదని విదేశీ మీడియాకు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని చాలా మంది సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక పక్కా బిజినెస్ ప్లాన్ ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

నిజానికి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు పెద్దగా అవసరం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న పోస్టర్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. అసలు ట్రైలర్ కూడా విడుదల చేయకపోయినా సరే, తెలుగు గడ్డపై ఈ సినిమాకు కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వస్తాయి. ఇక్కడి ప్రేక్షకులకు రాజమౌళి బ్రాండ్ వాల్యూ, మహేష్ బాబు స్టార్ పవర్ మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే లోకల్ మీడియా కంటే అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ను ప్రభావితం చేసే మీడియాని ఆయన ఎంచుకున్నారు.

అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాను కేవలం ఇండియన్ లెవల్‌లోనే కాకుండా హాలీవుడ్, యూరప్, చైనా మార్కెట్లలో భారీగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఆ దేశాల్లో సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే అక్కడి మీడియా హౌస్‌ల ద్వారా పబ్లిసిటీ రావడం చాలా ముఖ్యం. అమెరికన్ మీడియాలో వచ్చే కథనాలు హాలీవుడ్ ప్రేక్షకులకు సినిమాపై క్యూరియసిటీని పెంచుతాయి. అందుకే వెస్ట్రన్ మీడియాను సెట్స్‌లోకి ఆహ్వానించి, అక్కడి మార్కెట్‌కు కావాల్సిన బజ్ ను రాజమౌళి ముందే ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా సినిమాను గ్లోబల్ ప్రొడక్ట్‌గా మార్చే ప్రయత్నం.

రాజమౌళి విజన్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ‘RRR’ తో అతను సాధించిన అంతర్జాతీయ గుర్తింపును ‘వారణాసి’తో మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు, ఇంటర్నేషనల్ స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగం అవ్వడం వల్ల విదేశీ మీడియాలో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. లోకల్ మీడియాకు ఎలాగూ సినిమా రిలీజ్ సమయంలో యాక్సెస్ ఉంటుంది, కానీ గ్లోబల్ ఆడియన్స్‌ను రీచ్ అవ్వడానికి మాత్రం హాలీవుడ్ ప్రెస్ అవసరం ఎంతో ఉంది. దీన్ని గుర్తించే రాజమౌళి తన ఫోకస్ అంతా వెస్ట్రన్ మీడియాపై పెట్టినట్లు అర్థమవుతోంది.

రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద లాభాల్లోకి రావాలంటే విదేశీ వసూళ్లు చాలా కీలకం. కేవలం మన దేశంలోని కలెక్షన్లతో ఇంతటి భారీ టార్గెట్ ని రికవరీ చేయడం సాధ్యం కాదు. అందుకే ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ దగ్గర సినిమాకు మైలేజ్ ఇచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా రాజమౌళి వదులుకోవడం లేదు. హాలీవుడ్ మీడియాకు ఇస్తున్న ఈ స్పెషల్ యాక్సెస్ భవిష్యత్తులో సినిమా వసూళ్ల రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే భారతీయ సినిమా మార్కెట్ సరిహద్దులు మరింత మారిపోతాయని చెప్పవచ్చు.