వారణాసి 80 రోజుల్లో ఏం చేయబోతున్నారు?
సూపర్ స్టార్ మహేష్ కథనాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `వారణాసి`పై పాన్ ఇండియాలో ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 2 Aug 2026 1:40 AM ISTసూపర్ స్టార్ మహేష్ కథనాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `వారణాసి`పై పాన్ ఇండియాలో ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్.. మైథాలజీ .. టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్‌తో గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇంకా కేవలం 80 రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కెన్యాలోని అడవులు, అంటార్కిటికాలోని రోస్ ఐస్ షెల్ఫ్ వంటి అత్యంత క్లిష్టమైన అరుదైన గ్లోబల్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను తెరకెక్కించి చరిత్ర సృష్టించారు.
ఈ నేపథ్యంలో మిగిలిన 80 రోజుల షూటింగ్ కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా జక్కన్న ఎలాంటి లొకేషన్లలో చిత్రీకరణ జరపనున్నారు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో ఆ విషయాలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లలో బ్యాలెన్స్ షూట్ జరగనుంది. 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన పురాతన కాశీ (వారణాసి) నగరపు సెట్‌లో అత్యంత కీలకమైన యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.
వాటికి కంటున్యూటీ సన్నివేశాలనే బ్యాలెన్స్ షూట్ లో పూర్తి చేయనున్నారు. నిజమైన వారణాసి నగరంలో షూటింగ్ సాధ్యం కాదు. అందుకు సాహసిస్తే? లాజిస్టికల్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోనే వారణాసి సెట్‌ను ఏర్పాటు చేసి చిత్రీకరణ జరుపుతున్నారు. 80 రోజుల షెడ్యూల్‌లో ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించనున్నారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం సెట్స్‌లో 3500 మంది జూనియర్ ఆర్టిస్టులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారుట.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ , డిజిటల్ ఆగ్మెంటేషన్ సహాయంతో లైవ్ క్రౌడ్‌ను స్క్రీన్‌పై ఏకంగా 50000 నుంచి 100000 మంది యోధులతో కూడిన భారీ సైన్యంగా మలచనున్నారుట. ఇందులో మహేష్, పృథ్విరాజ్ సుకుమారన్,
ప్రియాంక చోప్రాతో పాటు ప్రధాన పాత్ర ధారులంతా పాల్గొంటారు. 80 రోజుల షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్-ప్రొడక్షన్ ..వీఎఫ్ఎక్స్ పనుల వేగం పుంజుకుంటుంది. ఎం.ఎం. కీరవాణి సెప్టెంబర్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను ప్రారంభిస్తారు. ఇలా అన్ని కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో పూర్తి చేసి అనుకున్న తేదీ ప్రకారం 2027 ఏప్రిల్ 7న `వారణాసి`ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ అహర్నిషలు శ్రమిస్తోంది. ఈ సినిమా విజయం అనంతరం మహష్ ఇమేజ్ ఏకంగా గ్లోబల్ స్థాయికి రీచ్ అవుతుంది. అనంతరం మహేష్ ఎలాంటి సినిమాలు చేస్తారు? అన్నది అంతే ఆసక్తికరం.
