Begin typing your search above and press return to search.

'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్.. జక్కన్న ప్లాన్ ఎక్కడ బెడిసికొట్టింది?

'వారణాసి' (గ్లోబ్ ట్రాటర్) ఈవెంట్ కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. 130 అడుగుల భారీ స్క్రీన్, హాలీవుడ్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్, లక్షలాది అభిమానులు.. రాజమౌళి ప్లానింగ్ చూసి ఇండస్ట్రీ షాక్ అయింది.

By:  M Prashanth   |   16 Nov 2025 9:22 AM IST
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. జక్కన్న ప్లాన్ ఎక్కడ బెడిసికొట్టింది?
X

'వారణాసి' (గ్లోబ్ ట్రాటర్) ఈవెంట్ కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. 130 అడుగుల భారీ స్క్రీన్, హాలీవుడ్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్, లక్షలాది అభిమానులు.. రాజమౌళి ప్లానింగ్ చూసి ఇండస్ట్రీ షాక్ అయింది. కానీ, వేల కోట్ల కలల ప్రాజెక్టుకు వేసిన ఈ మొదటి అడుగు, జక్కన్న ఊహించినంత పర్‌ఫెక్ట్‌గా మాత్రం పడలేదు. ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగినా, కొన్ని ఊహించని సమస్యలు రాజమౌళిని తీవ్రంగా నిరాశపరిచినట్లు స్పష్టంగా కనిపించింది.

ఈవెంట్ కోసం రాజమౌళి హోస్టింగ్ ప్లాన్ పేపర్‌పై అద్భుతంగా ఉంది. తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి 'టీవీ క్వీన్' సుమ, నార్త్ ఇండియా యూత్‌ను కవర్ చేయడానికి 'యూట్యూబ్ కింగ్' ఆశిష్ చంచ్లాని. ఈ కాంబోతో మొత్తం ఇండియాను కవర్ చేయాలని జక్కన్న ప్లాన్. అయితే, ఈ ప్లాన్ మొదటికే బెడిసికొట్టినట్లు కనిపించింది.

యూట్యూబ్ వీడియోలలో కోట్లలో వ్యూస్ తెచ్చుకునే ఆశిష్ చంచ్లాని, లక్ష మంది జనం ముందు రియల్ స్టేజ్‌పై తేలిపోయాడు. లైవ్ ఈవెంట్ ఒత్తిడిని అతను తట్టుకోలేకపోయినట్లు స్పష్టంగా కనిపించింది. అతనిలో ఆశించిన స్పార్క్ గానీ, ఎనర్జీ గానీ లోపించాయి. ముఖ్యంగా, స్టేజ్ ఈవెంట్లలో ఎంతో అనుభవం ఉన్న సుమతో అతని కెమిస్ట్రీ అస్సలు కుదరలేదు. కొన్నిసార్లు అతనికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక సైడ్ కి వెళ్లిపోవడంతో భారం మొత్తం సుమ మీదనే పడింది.

దీంతో, సోషల్ మీడియాలో "ఫాలోవర్ కౌంట్ కాదు, స్టేజ్ ఎక్స్‌పీరియన్స్ ముఖ్యం" అంటూ కామెంట్లు మొదలయ్యాయి. యాంకరింగ్ సమస్యతో రాజమౌళి అసహనంగా ఉన్న సమయంలోనే అసలైన సమస్య ఎదురైంది. అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న 'వారణాసి' కాన్సెప్ట్ ట్రైలర్‌ను ఆ వంద అడుగుల తెరపై ప్లే చేయగా, ఊహించని సాంకేతిక లోపం (టెక్నికల్ గ్లిట్చ్) తలెత్తింది. వీడియో పదే పదే ఆగిపోవడంతో రాజమౌళి తీవ్రంగా అప్‌సెట్ అయ్యారు. ఈ గందరగోళం వల్ల ఈవెంట్ అరగంటకు పైగా ఆలస్యమైంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన నెటిజన్లు కూడా పెదవి విరిచారు. ఇద్దరు యాంకర్ల మధ్య ఫ్లో కుదరడం చాలా కష్టమని, రాజమౌళి కేవలం సుమ ఒక్కరితోనే ఈవెంట్ చేసి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరైతే, 'రాధేశ్యామ్' ఈవెంట్‌లో అదరగొట్టిన నవీన్ పోలిశెట్టి, లేదా కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్ లాంటి అనుభవం ఉన్నవారే ఇలాంటి భారీ ఈవెంట్లకు కరెక్ట్ అని, యూట్యూబ్ స్టార్లను నమ్మడం పొరపాటని విశ్లేషించారు.

మొత్తానికి, రాజమౌళి ఎప్పుడూ పర్‌ఫెక్షన్ కోరుకుంటారు. కానీ ఈ గ్లోబల్ ఈవెంట్ మాత్రం ఆయన అనుకున్న స్థాయిలో జరగలేదన్నది వాస్తవం. హోస్టింగ్ అంచనాలను అందుకోలేకపోవడం, సాంకేతిక లోపాలు ఇబ్బంది పెట్టడం ఈవెంట్‌కు కాస్త మైనస్‌గా నిలిచాయి. ఎంత పెద్ద ప్లాన్ వేసినా, లైవ్ ఈవెంట్లలో అనుభవం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.