Begin typing your search above and press return to search.

చిన్న సినిమాలకు అండగా పాన్ వరల్డ్ దర్శకులు!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎన్నో కొత్త మార్పులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌త్యేకించి ఈ రెండు మూడేళ్ల కాలంలో వ‌స్తోన్న మార్పులు ప‌రిశ్ర‌మ‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్తున్నాయి.

By:  Srikanth Kontham   |   20 July 2026 12:23 PM IST
చిన్న సినిమాలకు అండగా పాన్ వరల్డ్ దర్శకులు!
X

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎన్నో కొత్త మార్పులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌త్యేకించి ఈ రెండు మూడేళ్ల కాలంలో వ‌స్తోన్న మార్పులు ప‌రిశ్ర‌మ‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు తమ సినిమాలకే పరిమితమైన అగ్ర దర్శకులు ఇప్పుడు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్లు చిన్న సినిమాల నిర్మాణంలో భాగస్వాములవుతూ వాటికి తమ బ్రాండ్ వాల్యూను జోడిస్తున్నారు. ఇది చిన్న సినిమాల బడ్జెట్ పెంచడమే కాకుండా? మార్కెట్‌లో వాటికి క్రేజ్ తీసుకు రావడానికి ఎంతగానో దోహదపడుతోంది.

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనదైన శైలిలో ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. ఆయన తన కుమారుడు కార్తి కేయ నిర్మిస్తోన్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' వంటి వైవిధ్యభరితమైన ప్రాజెక్ట్ కు సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రించి ప్రత్యేకమైన గుర్తింపునిస్తున్నారు. భారీ చిత్రాలను రూపొందించే క్రమంలో జ‌క్క‌న్న అనుభవం, మార్కెట్ అవగాహన చిన్న సినిమాలకు ఆక్సిజన్‌లా ప‌ని చేస్తుంది. ఒక స్టార్ దర్శకుడి పేరు తోడైతే? ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు అంత‌కంత‌కు పెరుగాయ‌న్న‌ది వాస్త‌వం.

'కె.జి.ఎఫ్', 'సలార్' వంటి భారీ చిత్రాలతో పాన్ ఇండియాని శాసించిన ప్రశాంత్ నీల్ కూడా ఈ కొత్త ఒరవడిలో భాగమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో వ‌స్తోన్న‌ హారర్ థ్రిల్లర్ '418' చిత్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఒక మాస్ దర్శకుడు థ్రిల్లర్ జానర్‌ను ప్రోత్సహించడం అనేది పరిశ్రమలో కొత్త ఊపును తెస్తోంది. ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల మద్దతు ఉండటం వల్ల చిన్న చిత్రాలు కూడా పెద్ద స్థాయిలో ప్రమోషన్ పొందే అవకాశం దక్కుతోంది. ఇది చిన్న నిర్మాతల భయాన్ని పోగొట్టి కొత్త కథలను నమ్మి ముందుకు వచ్చేలా చేస్తోంది.

సందీప్ రెడ్డి వంగ సైతం తనవంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా తెర‌కెక్కుతోన్న 'రోమాకం' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను స్వ‌యంగా నిర్మిస్తున్నారు. ఆ ర‌కంగా సందీప్ కొత్తవారికి తనదైన ప్లాట్‌ఫామ్‌ను కల్పిస్తున్నారు. కమర్షియల్ హంగులతో కూడిన రొమాంటిక్ కథలకు సందీప్ రెడ్డి వంగ మార్క్ తోడైతే ఆ సినిమా యువతను ఆకట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతిభ ఉన్న యువతను వెతికి మరీ అవకాశాలు ఇవ్వడం సందీప్ గొప్పతనానికి నిదర్శనం.

ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో సుకుమార్ ఎప్పుడూ ముందుంటారు. 'సుకుమార్ రైటింగ్స్' ద్వారా ఆయన ఇప్పటికే ఎంతోమంది కొత్త దర్శకులను, నటులను వెండితెరకు పరిచయం చేశారు. ఒక స్టార్ దర్శకుడు చిన్న సినిమాల నిర్మాతగా మారడం వల్ల ఆ సినిమాల మేకింగ్ క్వాలిటీ, స్క్రిప్ట్ విషయంలో మరింత స్పష్టత వస్తోంది. సీనియర్ దర్శకుల సలహాలు, సూచనలు చిన్న సినిమాలకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఇది పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని సృజనాత్మకతను పెంపొందిస్తోంది.

స్టార్ దర్శకుల సహకారం వల్ల టాలీవుడ్ భవిష్యత్తు మరింత సుసంపన్నం కానుంది. ఇది సినిమాల నిర్మాణానికే పరిమితం కాకుండా మంచి కథకు గ్లోబల్ రీచ్ ఇచ్చేలా చేస్తోంది. చిన్న సినిమాలకు అగ్ర దర్శకులు దన్నుగా నిలవడం వల్ల కొత్త కథలు, కొత్త ఆలోచనలు వెలుగు చూస్తున్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే టాలీవుడ్ ప్రపంచ సినిమా స్థాయిలో మరిన్ని అద్భుతాలను సృష్టించే అవకాశం ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.