Begin typing your search above and press return to search.

యాంకర్‌గా సుమ 25 సంవత్సరాల అజేయ ప్రయాణం

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మొట్టమొదటి చిత్రం `స్టూడెంట్ నంబర్ - 1` ప్రమోషనల్ ఈవెంట్‌తోనే సుమ యాంకర్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

By:  Sivaji Kontham   |   30 Sept 2026 9:22 AM IST
యాంకర్‌గా సుమ 25 సంవత్సరాల అజేయ ప్రయాణం
X

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మొట్టమొదటి చిత్రం `స్టూడెంట్ నంబర్ - 1` ప్రమోషనల్ ఈవెంట్‌తోనే సుమ యాంకర్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ యాంకర్‌గా దశాబ్దాల పాటు ఏలుతూనే ఉన్నారు. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌గాను పాపులర్ అయిన సుమ తన పాతికేళ్ల ప్రయాణంలో తిరుగులేని విజయాలను అందుకున్నారు.

అయితే `స్టూడెంట్ నంబర్.1` అంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయినా ఆ సినిమాకు సంబంధించి 5 ఏళ్ల ఫంక్షన్, 10 ఏళ్ల ఫంక్షన్, లేదా 20 ఏళ్ల ఫంక్షన్ అంటూ ఏదీ నిర్వహించలేదని.. ఇప్పుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా పరిచయం అవుతున్న `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` వేదికనే ఆ వేడుకగా మార్చామని యంగ్ టైగర్ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక వేదికపై యాంకర్ సుమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకోవడం విశేషం.

ఈ వేడుకలో భాగంగా రాజమౌళి సైతం పాతికేళ్లుగా సుమ యాంకర్‌గా సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ అభినందనలు కురిపించారు. `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్`ఈవెంట్‌లో యాంకర్ సుమ ప్రత్యేక ఏవీని ప్రదర్శించడం సముచిత గౌరవమని, ఇది జక్కన్న- కార్తికేయ బృందానికి వచ్చిన గొప్ప ఐడియా అని ఈ వేడుక‌ను వీక్షించిన వారంతా కొనియాడుతున్నారు. తెలుగు పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతురాలైన సుమ స్పాంటేనియానిటీ, టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని సుమ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు.

సుమకు ఏ పని మీదైనా ఉండే సంపూర్ణ నిబద్ధత, ముఖ్యంగా ఈవెంట్లలో సమయపాలన పాటించే తీరును రాజమౌళి ఎప్పుడూ అభినందిస్తుంటారు. అలాగే తెలుగు భాషలో స్పష్టమైన ఉచ్ఛారణ, అనర్గళంగా మాట్లాడే తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని.. స్టేజ్ మీద సుమ ఉంటే ఆ వాతావరణం ఎంతో ఉత్సాహంగా, నవ్వులతో నిండిపోతుందని జ‌క్క‌న్న అన్నారు. టాలీవుడ్‌లో ఏ పెద్ద వేడుక జరిగినా సుమ ఉండాలనేది ఒక అనివార్యమైన ఆనవాయితీగా మారిందని.. ఆ స్థానాన్ని తన కష్టంతో సంపాదించుకున్నారని ప్రశంసించారు.

ఈ పాతికేళ్లుగా ఎదురే లేని యాంకర్‌గా పోటీని తట్టుకుని నిలదొక్కుకోవడం నిజంగా గొప్ప విషయమని రాజమౌళి గుర్తుచేశారు. ప్రస్తుతం టెలివిజన్ ప్రొడ్యూసర్‌గా, సినిమా నిర్మాతగా కూడా ఎదిగేందుకు సుమ ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా.. త‌న‌ కుమారుడు రోషన్ కనకాల `బబుల్‌గమ్` సినిమాతో డిసెంబర్ 2023లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాత‌గాను సుమ స‌హ‌కారం ఎంతో గొప్ప‌ది. సుమ తన ప్రొఫెషనలిజంతో ఇండస్ట్రీకి చేస్తున్న సేవలను అందరూ గౌరవిస్తున్నారు. ముఖ్యంగా సుమ యాంక‌రింగ్ కి ఆద‌ర‌ణ అనేది ఎప్ప‌టికీ ఎండ్ కానిది.